ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరివీరభక్తుడు. ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగి, బీజేపీలో దశాబ్దాల పాటు పని చేసిన నేత, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడీకి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రాధాన్యతను తగ్గించి వేసినట్టుగా తెలుస్తోంది.
ఆయనను బిహార్ ఉపముఖ్యమంత్రి హోదా నుంచి తప్పించిందట అధిష్టానం. ఈ మేరకు తన ట్విటర్ ప్రొఫైల్ లో కూడా సుశీల్ మోడీ ఉపముఖ్యమంత్రి హోదాను తీసేసుకున్నట్టుగా తెలుస్తోంది. బిహార్ తాజా, మాజీ ప్రభుత్వంలో సుశీల్ మోడీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
నితీష్ కుమార్ తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సుశీల్ మోడీకి ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆ కూటమే మరోసారి బిహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉండగా.. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతున్నారు. అయితే సుశీల్ మోడీకి మాత్రం ఉపముఖ్యమంత్రి పదవి దక్కడం లేదని తెలుస్తోంది. దీనికి ప్రత్యేకమైన కారణాన్ని ప్రకటించలేదు భారతీయ జనతా పార్టీ.
కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడం కోసమే సుశీల్ మోడీని తప్పించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఉపముఖ్యమంత్రి పదవిని మాత్రం బీజేపీ వదులుకోవడం లేదు. ఆ హోదా విషయంలో ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వారిలో ఒకరు తర్ కిషోర్ ప్రసాద్, మరొకరు రేణూ దేవీ. వీరిద్దరూ దశాబ్దాలుగా బీజేపీలో పనిచేసిన వారు.
తర్ కిషోర్ ఒక వైశ్య ఉపకులానికి చెందిన వ్యక్తి కాగా, రేణూ దేవీ బాగా వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. వీరిద్దరిలో ఒకరికి ఉపముఖ్యమంత్రి పదవి దక్కనుందట. ఇద్దరినీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. బీజేపీ ఏదనుకుంటే అదే జరుగుతుంది. వీరికి కృతజ్ఞతలు చెప్పారు సుశీల్ మోడీ. వారితో తనకు దశాబ్దాలుగా కలిసి పని చేసిన అనుభవం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇలా బిహార్ రాజకీయంలో మార్పు చేర్పులు చేస్తూ ఉంది కమలం పార్టీ. సరైన నాయకత్వ లేమి అక్కడ కమలం పార్టీని ఇబ్బంది పెడుతూ ఉంది. ఉన్నంతలో నాయకుడిగా ఉండిన సుశీల్ మోడీని కూడా కమలం పార్టీ అధిష్టానమే పక్కన పెడుతూ ఉంది. కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్టుగా ఉంది.