గజానికొక గాంధారీ పుత్రుడు అని అపుడెపుడో ప్రముఖ కవి బాలగంగాధర తిలక్ చెప్పారు. కానీ ఇపుడు ఆయనే బతికుంటే గజానికో అక్రమం అని ఎలుగెత్తి చాటేవారేమో. మహా విశాఖ నగరంలో తరచి చూడాలే కానీ అడుగడుగునా అక్రమాలకు కొదవే లేదు.
అయితే కాంగ్రెస్ లేకపోతే టీడీపీ ఏలుబడి అన్నట్లుగా సాగిన రాష్ట్రంలో ఇంతకాలం పచ్చ పచ్చగా విశాఖలో అక్రమాలు సాగిపోయాయి. ఇపుడు వైసీపీ అధికారంలో ఉంది. అదీ కూడా విశాఖను పాలనా రాజధానిగా చేసింది. దాంతో స్పెషల్ అటెన్షన్ ఈ సిటీ మీద ఉంచింది.
ఇపుడు ఒక్కో అక్రమ వ్యవహారం అలా బయటకు తెస్తూ ప్రభుత్వం ఏకంగా ఉక్కు పాదమే మోపుతోంది. తాజాగా విశాఖ నగరం నడిబొడ్డున వుడా నుంచి లీజుకు తీసుకున్న ఓ ఫ్యూజన్ ఫుడ్స్ ని ఏళ్ల తరబడి తన గుప్పిట్లో ఉంచుకున్న తెలుగుదేశం నాయకుడు హర్ష వర్ధన్ నుంచి ఇపుడు ఖాళీ చేయించే పనిని విశాఖ అధికారులు చేపట్టారు.
ఎదురుగా ఉడా ఆఫీస్ ఉన్నా ఇన్నాళ్ళూ ఈ చోద్యాన్ని చూస్తూ అధికారులు పుణ్య కాలం గడిపేశారు. ఇపుడు టైం వచ్చింది అంతే అక్రమ లీజు కధను వైసీపీ పెద్దల చొరవతో అధికారులు క్లైమాక్స్ కి చేరుస్తున్నారు.
చిత్రమేంటంటే ఉడా నుంచి లీజుకు తీసుకున్న ఈ ఫ్యూజన్స్ ఫుడ్స్ ని ఇంతకు రెండింతలుగా వేరొకరిని అద్దెకు ఇచ్చి లీజుదారుడు లబ్ది పొందుతున్నా ఇంతకాలం అధికారులు పట్టించుకోలేదని భోగట్టా.. మరి ఇపుడు అక్రమ లీజు అని అధికారులు వచ్చి ఖాళీ చేయిస్తూంటే యధా ప్రకారం నోటీసులు ముందుగా ఇవ్వలేదు అంటూ టీడీపీ నేత హర్ష వర్ధన్ ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి విశాఖ లో దురాక్రమణలపైన అతి పెద్ద ఆపరేషన్ జరుగుతోంది.