జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు ఆ పార్టీ శ్రేణులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. సినిమా షూటింగ్‌లతో బిజీ అయిపోయిన పవన్‌కల్యాణ్ తనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉందన్న విషయాన్ని కూడా మరిచినట్టున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా ఆయన దూరమయ్యారనే విమర్శలున్నాయి. అప్పుడప్పుడు ట్వీట్లు, ప్రెస్‌నోట్లతో మీడియాలో తప్ప …..మరెక్కడా పవన్ కనిపించిన దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ క్రియాశీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు జనసేనాని పవన్‌కల్యాణ్ రానున్నారు. సమావేశాలకు సంబంధించి షెడ్యూల్‌ను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ముఖ్య నాయకులను కలుస్తున్నట్టు లేదు.
17న ఉదయం 11 గంటలకు క్రియాశీల సభ్యత్వ నమోదు పూర్త యిన ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలపై సమీక్షిస్తారు. అలాగే ఆ రోజు మధ్యాహ్నం తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్యనేతలతో భేటీ అవుతారు.
18న అమరావతి పోరాట సమితి నేతలు, రాజధాని మహిళా నేతలతో భేటీ అవుతారు. అలాగే మధ్యాహ్నం సభ్యత్వం చేపట్టనున్న నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమావేశమవుతారు. ఏఏ నియోజకవర్గాలనేది స్పష్టత లేదు.
ఇటీవల ఏపీలో అనేక రాజకీయ పరమైన వివాదాలు చెలరేగాయి. వీటిపై ఎక్కడా పవన్ స్పందించలేదనే విమర్శలున్నాయి. చివరికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహిస్తే …. దానికి కూడా పార్టీ ప్రతినిధిని పంపలేని పరిస్థితి. కేవలం మెయిల్‌లో తమ అభిప్రాయాల్ని పంపడంపై విమర్శలొచ్చాయి.
తాజాగా నంద్యాలలో అబ్దుల్‌సలాం ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటన తనను కలచివేసిందని పవన్ కల్యాణ్ ఓ ట్వీట్‌తో సరిపెట్టారు. అంతే తప్ప, ఓ రాజకీయ పార్టీగా అసలు అక్కడేం జరిగిండో తెలుసుకుని స్పందించాలనే ఉత్సాహం ఆ పార్టీలో కొరడింది. వివిధ ముఖ్యమైన అంశాలపై పవన్ మౌనాన్ని ఆశ్రయిస్తుండడంతో , ఆ పార్టీ అధికార ప్రతినిధులకు ఎలా స్పందించాలో అర్థం కాని అయోమయ పరిస్థితి.
అలాగే పార్టీలో నెంబర్ 2గా పేరొందిన నాదెండ్ల మనోహర్ ఆచూకీ కూడా ఈ మధ్య కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు క్రియాశీలక సమావేశాలు నిర్వహించాలని పవన్ భావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకూ పేరుకే మాత్రమేనా క్రియాశీలక సమావేశాలు …నిర్ణయాలు ఆ స్థాయిలో ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది.