శ్రీబాగ్ అవగాహన – మూడు రాజధానులు

చరిత్రలో అవగహన లేదా ఆలోచనల యొక్క సార్వజనీనత కాలగమనంలో దాని ప్రాధాన్యం మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా 84 సంవత్సరాల క్రితం ( 16-11-1936 ) కోస్తా – రాయలసీమ పెద్దల సమక్షంలో  శ్రీబాగ్…

చరిత్రలో అవగహన లేదా ఆలోచనల యొక్క సార్వజనీనత కాలగమనంలో దాని ప్రాధాన్యం మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా 84 సంవత్సరాల క్రితం ( 16-11-1936 ) కోస్తా – రాయలసీమ పెద్దల సమక్షంలో  శ్రీబాగ్ ఒప్పందం కుదిరింది.

ఆ రోజు పెద్ద మ‌నుషులు కుదుర్చుకున్న ఒప్పందం నేటికీ ప్రాధాన్యత సంతరించుకోవడం శ్రీబాగ్ సార్వజనీనతకు మంచి ఉదాహరణ. నేడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణలో భాగంగా శ్రీబాగ్ ప్రస్తావన రావడం కీలక అంశంగా పరిగణనలోకి తీసుకోవాలి.

శ్రీబాగ్ అవగహనకు దారితీసిన పరిస్థితులు..

నేడు పాలనా వికేంద్రీకరణలో భాగంగా  మూడు రాజధానుల చట్టానికి  శ్రీబాగ్ అవగాహన నాటి పరిస్థితులు నేడు కూడా ఉండటం ఒక కారణంగా చెప్పక తప్పదు. 1953 ఆక్టోబర్ 1 కి పూర్వం నేటి ఆంద్రప్రదేశ్ ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నది. 

తమిళుల ఆధిపత్యం నుంచి వేరుపడాన్న ఉద్దేశంతో 1913 లో ఆంధ్రమహాశభ జరిగింది. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపు నిచ్చింది. అయితే ఈ  మ‌హాస‌భకు సీమ ప్రతినిధులు హాజరుకాలేదు. సీమ ప్రాంతం కలవకుండా మద్రాసు నుంచి విడిపోవడం సాధ్యం కాద‌న్న ఉద్దేశంతో కోస్తా పెద్దలు కమిటీగా ఏర్పడి 1917లో సీమ ప్రాంతంలో పర్యటించారు.

కోస్తా ప్రాంతంతో కలిసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి రాయలసీమ పెద్దలు విముఖత చూపడానికి రెండు కారణాలు ముందుకు వచ్చాయి. 

1. అప్పటికే ఆంగ్లేయులు పాలనలో కాటన్ బ్యారేజీ , ప్రకాశం బ్యారేజీ అందుబాటులో ఉన్న కారణంగా మధ్య కోస్తా ప్రాంతం వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించింది. విద్యారంగంలో కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి ఉన్నది. అలాంటి ప్రాంతంతో కలిపి వెనుకబడిన రాయలసీమ ప్రాంతం కలిసి రాష్ట్రంగా ఏర్పడితే నష్టం.

2. సీమలోని చిత్తూరు , కడప , నెల్లూరు , ఒంగోలు ( ఒంగోలు వరకు సీమ ప్రాంతంలో కలిసి ఉన్నాయి. ) చెన్నై నగరంతో ఉపాధి అనుబంధం ఉన్నది. అందుబాటులో ఉన్న చెన్నై నగరాన్ని వదులుకోవడం కూడా అనాసక్తతకు ఒక ముఖ్యమైన కారణం.

పై రెండు కారణాలతో సీమ పెద్దలు కోస్తా ప్రాంతంతో కలిపి రాష్ట్రంగా ఏర్పడటానికి ఆసక్తి చూపలేదు. అలాంటి సమయంలో కోస్తా రాయలసీమ పెద్దలు నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజాధాని ఎంచుకునే విషయంలో సీమకు ప్రాధాన్యత , కృష్ణా , తుంగభద్ర నదులలో లభించే నీటిని సీమ ప్రాంత అవసరాలకు వినియోగించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలన్న కీలక అంశాల ప్రాతిపదికన 1936 నవంబర్ 16న‌ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు స్వగృహం ( శ్రీబాగ్, చెన్నై )లో జరిగిన సమావేశంలో ఒప్పందం కుదిరింది. అదే శ్రీబాగ్ ఒప్పందం.

సమతుల్యతను దెబ్బతీసేలా అమరావతి ప్రాజెక్టు

శ్రీబాగ్ అవగాహన , పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా 1953 ఆక్టోబర్ 1న‌ కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఆ త‌ర్వాత ఆంధ్రరాష్ట్రం – తెలంగాణ కలిపి 1956 నవంబరు 1న‌ హైదరాబాద్ రాజధానిగా ఆంద్రప్రదేశ్ ఆవిర్భ‌వించింది. అలా శ్రీబాగ్ ఒప్పందం అమలు కాకుండానే కొత్త రాష్ట్రం ఏర్పడింది. 

ఫలితంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోయింది. అనేక కారణాలుతో 2014 లో మరో విభజన కారణంగా 13 జిల్లాల ఆంద్రప్రదేశ్ ఏర్పడింది. తొలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన అనుభవాలను , చారిత్రక అవగాహనలను ఏ మాత్రం పట్టించుకోకుండా రాజకీయ కూడికలు తీసివేతలు ప్రాతిపదికన , వ్యాపార ప్రయోజనాల ప్రాతిపదికన అమరావతి ప్రాజెక్ట్‌కు రూప‌క‌ల్పిన చేశారు.

అమరావతి ప్రాజెక్టు నమూనా ఎంపిక చేసిన విధానం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధ‌తే కాకుండా రాయలసీమ , ఉత్తరాంధ్ర , గోదావరి , పల్నాడు ప్రాంతాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా రూపొందించారు. 

విశాఖ , కాకినాడ , రాజమండ్రి , విజయవాడ , గుంటూరు , నెల్లూరు , తిరుపతి , కర్నూలు లాంటి అభివృద్ధి చెందిన నగరాలు అందుబాటులో ఉన్న13 జిల్లాల చిన్న రాష్ట్రం – పరిమిత వనరులు కలిగిన రాష్ట్రానికి మరో కొత్త నగర నిర్మాణం అనవసరం , అసాధ్యం. ఈ విష‌యాల‌న్నీ  తెలిసి కూడా తెలుగుదేశం ప్రభుత్వం పేరు ప్రతిష్టలు , ఆర్థిక ప్రయోజనాల ప్రాతిపదికన అమరావతి ప్రాజెక్టును రూపొందించింది.

రాయలసీమ – ఉత్తరాంధ్ర వెనుకబాటును విస్మరించడం ప్రమాదం

రాయలసీమ జిల్లాల్లో 98 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా 13 శాతం ఇస్తామని చెప్పి, ఆచరణలో 7 శాతం కూడా ఇవ్వడం లేదు. భారీ వర్షాలు కురిసి  వందల టీఎంసీల నీరు సముద్రం పాలు అవుతున్నా పట్టుమని 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి రాయలసీమ ప్రాంతానిది. విశాఖ మినహా మిగిలిన ఉత్తరాంధ్ర ప్రాంతానిది కూడా ఇలాంటి దుస్థితే. బాధ్యత క‌లిగిన పాలకులు  ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను రూపుమాపేందుకు ప్రయత్నం చేయాలి. 

అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వనరులను , కీలక సంస్థలన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకే అమరావతి ప్రాజెక్టు అసాధ్యంతో పాటు ఆమోద‌యోగ్యం కూడా కాదు. ఒక‌వేళ బలవంతంగా ఆ ప్రాజెక్టును కొన‌సాగించే ప్రయత్నం చేస్తే మాత్రం రాష్ట్రంలో  ప్రాంతాల మధ్య సమతుల్యత దెబ్బతిని ప్రమాదకర పరిస్థితులు త‌లెత్తుతాయి.

మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్‌ మెరుగైన నిర్ణయం

రాజధాని ఎంపిక పై కేంద్రం నియ‌మించిన కమిటీ చైర్మ‌న్‌ శివరామకృష్ణన్ తాను చనిపోయేముందు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో ” బాబు గారు నేటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసింది అద్భుతమైన రాజధాని నిర్మాణం కాదు. ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించడం. నాయుడు గారు మీరు నాలుగు అడుగులు వెనకకు వేయడానికి ఇంకా సమయం మించి పోలేదు. 

రాష్ట్ర యావత్తు సంపదను అమరావతి ప్రాజెక్టు కోసం తాకట్టు పెట్టడం ఆత్మహత్యా స‌దృశ్యమే అవుతుంది” అని చిల‌క్కు చెప్పిన‌ట్టు చెప్పారు. దురదృష్టవశాత్తు నాటి ముఖ్యమంత్రి వారి మాటను చెవికెక్కించుకోలేదు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టు నుంచి బయటకి రావడం సముచిత నిర్ణయం. అలాగే అభివృద్ధి, ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌కు మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్‌ను చేప‌ట్ట‌డం స‌ముచితం.

మూడు రాజధానులు – అధిక వ్యయం అన్న వాదన అర్ధరహితం

ఒక రాజధాని నిర్మాణానికే డ‌బ్బు లేన‌ప్పుడు, మూడు రాజధానులకు అద‌న‌పు వ్య‌వ‌యం అవుతుంది క‌దా అనే వాద‌న తెర‌పైకి తెస్తున్నారు. ఈ  వాదనలో అర్థం లేదు. అమరావతి నిర్మాణం పూర్తిగా కొత్త నగరం. అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్న‌ది.

పేరుకు మూడు రాజధానులు అంటున్నా ఆచరణలో కొత్త నగరాల నిర్మాణం జరగదు. విశాఖపట్నంలో సచివాలయ భవనాల నిర్మాణం మాత్రమే  జరుగుతుంది. కర్నూలులో హైకోర్టు , ఇతర న్యాయ శాఖ కార్యాలయాల నిర్మాణం మాత్రమే జరుగుతుందే తప్ప కొత్త నగర నిర్మాణం మాటే త‌లెత్త‌దు.

84 సంవత్సరాల తర్వాత కూడా శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాల్సి రావడం ద్వారా శ్రీబాగ్ విశ్వసనీయతకు అద్దం పడుతోంది. శ్రీబాగ్ ఒప్పందంలో మరో కీలక అంశం కృష్ణా , తుంగభద్ర నదుల నీటిని రాయలసీమ ప్రాంతానికి అందించేందుకు కాల్వల సామర్థ్యం పెంపు , రాయలసీమ ఎత్తిపోతల పథకం , గుండ్రేవుల , సిద్ధేశ్వరం , తుంగభద్ర నీటిని ఉపయోగించే విధంగా ప్రణాళికలు , చెరువుల పునరుద్ధరణల పూర్తి చేయాలి.

అపుడే శ్రీబాగ్ ఒప్పందానికి సార్థ‌కత. అలాగే రాయలసీమకు న్యాయం జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన స్వ‌గృహానికి శ్రీ‌బాగ్ అని పేరు పెట్టుకున్నారు.  జలయజ్ఞం ద్వారా రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాల నీటి సమస్య పరిష్కారానికి ఆయ‌న సంక‌ల్పించారు.

దురదృష్టవశాత్తు వారి మరణంతో  నీటి సమస్య పరిష్కారం కలగానే మిగిలింది. వైఎస్‌ రాజకీయ వారసుడిగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి శ్రీబాగ్ అవగాహనలోని నీటి సమస్యను పరిష్కరిస్తారని రాయలసీమ సమాజం ఆశిస్తోంది.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త,
రాయలసీమ మేధావుల ఫోరం
9490493436