ఆంధ్రజ్యోతి భలే చిలిపి. జనసేనాని పవన్‌పై భలే జోకులేస్తోంది…కాదు రాస్తోంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్న నేపథ్యంలో, ఏపీ రాజకీయాలు హస్తిన కేంద్రంగా నడవనున్నాయి. పార్లమెంట్‌లో ఈ తీర్మానం ఆమోదం పొందుతేనే మండలి రద్దు అయినట్టు లెక్క. ఇదీ అసలు వార్త.
కొంత కాలంగా ఆంధ్రజ్యోతి – టీడీపీ కలిసి ఓ ప్లాన్ ప్రకారం పవన్‌కు అనుకూల వార్తా కథనాలు వండుతున్నారు. పవన్‌ను చంద్రబాబు పొగడటం, దాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడులో పతాక శీర్షకలతో ప్రచురించడం ఓ పథకం ప్రకారం జరుగుతోంది. ఎందుకైనా మంచిదని పవన్‌ను చంద్రబాబు అండ్ కో దువ్వడం మొదలు పెట్టాయి. అయితే పవన్ మనసులో మోడీ ఉండటంతో…ఓ శుభోదయాన ఆయన చక్కగా ఢిల్లీ వెళ్లి…బీజేపీకి తాంబూలాలు ఇచ్చాడు. ఆ తర్వాత విజయవాడలో బీజేపీ -జనసేన నాయకులు సమావేశమై ఉమ్మడి అజెండాను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతానికి వద్దాం. మండలి రద్దు తీర్మానాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని జనసేనాని పవన్‌కల్యాణ్ చురుగ్గా పావులు కదుపుతున్నాడని, బీజేపీతో ఇటీవలే పొత్తు కుదుర్చుకున్న ఆయనకు బీజేపీ అధినాయకత్వంతో సత్సంబంధాలున్నాయని, జగన్‌కు పవన్ చెక్ పెట్టే అవకాశాలున్నాయని ఆంధ్రజ్యోతి వెబ్ పేజీలో రాశారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా?
అసలు తన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను కాపాడుకోలేని పవన్‌కల్యాణ్‌కు బీజేపీ అధినాయకత్వంతో సత్సంబంధాలట! తాను చెప్పినట్టు రాపాకనే వినలేదు. అలాంటిది బీజేపీ అధినాయకత్వమట…మరీ కామెడీ ఎక్కువైనట్టుంది. ప్రధాని మోడీ ఇంత వరకూ పవన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వనేలేదు. కానీ మరో సినీ నటుడు మోహన్‌బాబు తన కుటుంబ సభ్యులతో వెళ్లి ప్రధానితో అరగంట సేపు గడిపారు. కనీసం ప్రధాని అపాయింట్‌మెంట్ ఇచ్చే దిక్కులేని పవన్‌కు, బీజేపీలో ఏ అధినాయకత్వంతో సత్సంబంధాలున్నాయో మరి!
జగన్ ఏక పక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని భావిస్తున్న పవన్ కల్యాణ్.. మోదీ సర్కార్‌పై ఒత్తిడి తేవడం ద్వారా మండలిపై వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తున్నారని రాశారు. కనీసం జనసేన అధ్యక్షుడిగా తానే గెలవలేని పవన్‌ను ఎక్కడ పెట్టాలో బీజేపీ అధినాయకత్వానికి బాగా తెలుసు. ఆ మాత్రం తెలియకుండానే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి బీజేపీ రాగలిగిందా? ఏంటో, ఇలాంటి వార్తలు రాస్తే ఆంధ్రజ్యోతి ఆర్‌కేకు అదో తుప్తి…అంతేగా …అంతేగా మరి.