ఎమ్బీయస్‌: టిడిపి గైరుహాజరీ

ఇవాళ మండలి రద్దు అంశంపై ఏర్పరచిన అసెంబ్లీ సమావేశానికి టిడిపి గైరు హాజరైంది. దానిలో ఔచిత్యం గురించి, దానికి గల కారణాల గురించి మాట్లాడేముందు మండలి రద్దు నిర్ణయం జగన్‌ చేస్తున్న ఘోర తప్పిదమనే…

ఇవాళ మండలి రద్దు అంశంపై ఏర్పరచిన అసెంబ్లీ సమావేశానికి టిడిపి గైరు హాజరైంది. దానిలో ఔచిత్యం గురించి, దానికి గల కారణాల గురించి మాట్లాడేముందు మండలి రద్దు నిర్ణయం జగన్‌ చేస్తున్న ఘోర తప్పిదమనే నా అభిప్రాయాన్ని – రాజకీయ నాయకుల స్టయిల్లో – పునరుద్ఘాటిస్తున్నాను. మాట్లాడితే ఆరు రాష్ట్రాలలో తప్ప మెజారిటీ రాష్ట్రాలలో మండలి లేదని వాదిస్తున్నారు. మరి మెజారిటీ రాష్ట్రాలలో రాజధాని, హైకోర్టు ఒకే చోట ఉన్నాయి కదా అంటే అక్కడ ఆ పోలిక పనికి రాదంటారు. చైర్మన్‌ తప్పు చేసి ఉంటే ఆయన్ని అభిశంసించాలి, తొలగించే ప్రయత్నం చేయాలి. అంతే మొత్తానికే ఎసరు పెట్టకూడదు. చైర్మన్‌కి విచక్షణాధికారం అంటూ ఉన్న తర్వాత దాన్ని ఉపయోగించకూడదు అని అనడానికి మనం ఎవరం?

''వైయస్సార్‌తో..'' అని ఉండవల్లి పుస్తకం రాశారు. దానిలో తన ఆంబేడ్కర్‌ వివాదం గురించి రాస్తూ తను మునిసిపల్‌ కమీషనర్‌ అధికారాలను ఎలా సమర్థించానో చెప్పుకొచ్చారు. రాజమండ్రి మునిసిపల్‌ కౌన్సిల్‌లో టిడిపికి ఆధిక్యత ఉంది. రాష్ట్రప్రభుత్వ దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమమైన 'ఇందిరమ్మ' కమిటీలలో అధ్యక్షుడిగా ఎన్నికైన కార్పోరేటర్‌ ఉంటాడు. మెంబర్లగా ఓడిపోయిన కార్పోరేటర్లను నియమించే అధికారం కమిషనర్‌కు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు యిచ్చింది. రాష్ట్రమంతా అలాగే జరిగినా, రాజమండ్రిలో మాత్రం టిడిపి కార్పోరేటర్లు ఒప్పుకోలేదు. కమిషనర్‌కు ఆ అధికారం లేదని, మేం చెప్పినవారినే సభ్యులుగా వేయాలనీ వాదించసాగారు. ఉండవల్లి వెళ్లి 'రూల్స్‌ ప్రకారం కమీషనర్‌ కమిటీలు వేశారనీ అన్నీ రాజ్యాంగానికి లోబడే జరుగుతాయని, మెజార్టీ ఉంటే ఏమైనా చేయవచ్చు అనుకుంటే యీ పాటికి మనం దేశాన్ని మింగేసి ఉండేవాళ్లమనీ, అలా సాధ్యపడకుండా అడ్డుపడేలా రాజ్యాంగమొకటి ఉంద'నీ వాదించారు. 

ఆ సందర్భంగా 'దురదృష్టం, ఆంబేడ్కర్‌ రాజ్యాంగం రాశారు కాబట్టి, దాన్ని బట్టే ఆఫీసర్లు నడుచుకుంటారు' అన్నారు. వెంటనే ఆంబేడ్కర్‌ రాజ్యాంగం రాయడం దురదృష్టమా అని వివాదం బయలుదేరింది. క్షమాపణ చెప్పి ఉండవల్లి బయటపడ్డారు. అయితే అక్కడ ఆయన ఉన్న మాటలు ముఖ్యం. మెజార్టీ ఉంది కదాని మనం ఏది పడితే అది చేసేయకూడదు. చైర్మన్‌కి తన విచక్షణాధికారం ఉపయోగించి సెలక్టు కమిటీకి పంపే అధికారం ఉంది. మీకు మండలి రద్దు సిఫార్సు చేసే అధికారం ఉంది. మీది మీరు ఉపయోగించినట్లే, ఆయనా ఆయన అధికారాన్ని ఉపయోగించాడు. ఇక పగ దేనికి? అది తీర్చుకోవడానికి యింత తొందరెందుకు? 

దిశ విషయంలో ఏమనుకున్నాం? పోలీసులు ఇన్‌స్టంట్‌ జస్టిస్‌ డిస్పెన్స్‌ చేయడం తప్పు, కోర్టు విచారణలో అనవసర జాప్యం కలుగుతుందనే ధైర్యం నిందితులకు కలగకుండా, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పెట్టి విచారణ త్వరగా ముగించాలన్నాం. వైసిపి చేసిన దిశ చట్టం కూడా అదే చెపుతోంది. ఇక్కడ కూడా మండలిని తన అదుపులోకి తెచ్చుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రజాస్వామిక పద్ధతులన్నీ ఉపయోగించాలి. రాజధాని మార్పు కానీ, విభజన కానీ కొన్ని నెలలు వాయిదా పడితే జరిగే నష్టమేముంది? నాలుగేళ్లగా అమరావతి రాజధాని అనుకున్నారు. ఇంకో నాలుగు నెలలు అనుకుంటారు. ఈ లోగా ఆగిపోయే రాచకార్యాలున్నాయా? ఈ రద్దుతో నేననుకున్నదే జరగాలి, అనుకున్న వెంటనే జరగాలి అనే పంతమే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇది మంచి ధోరణి కాదు. మండలి తనకు అడ్డుపడుతోండడంతో అహంకారం దెబ్బ తిని ఎన్టీయార్‌ దాన్ని ఎత్తేశారు. 1989లో ఓడిపోయాడు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఐదేళ్లు పట్టింది. ఏడాది తిరక్కుండా అల్లుడు సీటు పట్టుకుపోయాడు. అహంకారం యింకో దెబ్బ తిని, యీసారి గుండె ఆగింది.

ఇక టిడిపి గురించి – వాళ్లు అసెంబ్లీకి రాకపోవడం పొరబాటు. మండలి రద్దు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్పాల్సింది. ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సింది. దాని వలన ప్రయోజనం ఏముంది? అనే వాదన వ్యర్థం. 'నోటా'కు ఓటు వేయదలచినవారు కూడా ఎండలో నిలబడి, తమ వంతు కోసం వేచి ఉండి వేస్తున్నారు. 70 ఏళ్లగా మనకు ప్రజాస్వామ్యం ఉండడంతో మనకు ఓటు హక్కు విలువ తెలియకుండా పోతోంది. నియంతృత్వం ఉన్న దేశాల్లో ఓటు హక్కు కోసం జనాలు అలమటిస్తారు. ఇటీవలిదాకా కొన్ని పాశ్చాత్య దేశాల్లో మహిళలకు ఓటు హక్కు వుండేది కాదు. మనకు అన్నీ వచ్చీ ఒళ్లో పడడంతో విలువ తెలియటం లేదు. ఓటు వేయండి మహాప్రభో అని గడ్డం పట్టుకుని బతిమాలి, సెలబ్రిటీల చేత కాన్వాస్‌ చేయించాల్సి వస్తోంది. అయినా ఓటింగు శాతం తగినంతగా ఉండటం లేదు.

సామాన్య ప్రజల్ని ఓటేయమని ఒత్తిడి చేసే రాజకీయ నాయకులు తాము ఓటు వేయకపోతే ఎలా? పైగా ఓటరు తన ఓటు ద్వారా తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే చెప్తాడు. ఒక ఎమ్మెల్యే లక్షలాది మంది తరఫున అభిప్రాయం చెప్తాడు. తను అసెంబ్లీకి వెళ్లకపోతే ఆ లక్షలాది మంది బాధల్ని, భావాలను ప్రజల దృష్టికి తేవడంలో విఫలమైనట్లే. గతంలో వైసిపి అసెంబ్లీని బహిష్కరించి నపుడు టిడిపి వారు ఎద్దేవా చేశారు. నేను కూడా వ్యాసాలు రాశాను – ఇది తప్పు అని. రోజా క్షమాపణ చెప్పయినా, అసెంబ్లీలో ప్రవేశం సంపాదించాలని, తనకు ఓటేసిన నియోజకవర్గ ప్రజల పట్ల ఆమె బాధ్యత అది అని వాదించాను. ఇప్పుడు టిడిపి వాళ్ల విషయంలోనూ అదే చెప్తాను – టిడిపి ద్వారా 23 మందే నెగ్గవచ్చు, 21 మందే మిగలవచ్చు. కానీ 39% మంది ఓటర్ల అభిప్రాయాలను అది ప్రతిబింబిస్తోంది. ఈ 7 నెలల్లో అది పెరిగిందో, తగ్గిందో తెలుసుకునే థర్మామీటరు మన దగ్గర లేదు. అసెంబ్లీకి హాజరై తమ ప్రతిఘటన తెలపాలి. యుద్ధం చేసిన ప్రతీసారీ మనం గెలవాలని లేదు. కానీ యుద్ధభూమిని వదిలి వచ్చేయడం పద్ధతి కాదు.

గతంలో వైసిపికి యిదే విషయాన్ని గుర్తు చేసిన టిడిపి యిప్పుడు అసెంబ్లీకి వెళ్లకపోవడానికి కారణం ఏమిటి? నాకైతే మండలిలో రాజధాని బిల్లుపై ఓటింగు జరగకుండా చూడడానికి ఏ కారణమో, అదే కారణమనిపిస్తోంది. ఓటింగులో పాల్గొంటే కొంతమంది తమ వైపు ఓటేయరేమోనన్న భయం ఉండి వుండవచ్చు. గతంలో అనుకున్నట్లే ఇది రెండు జిల్లాలు వెర్సస్‌ 11 జిల్లాల వ్యవహారంగా తేల్తోంది. ఆ చీలిక బయటపడుతుందేమోనన్న భయంతో టిడిపి యిలా అసెంబ్లీ ఎగ్గొడుతూంటే ప్రజల అనుమానాలు మరీ పెరుగుతాయి – ఇవాళ వైసిపి ఎమ్మేల్యేలు దాదాపు 20 మంది ఓటింగు సమయంలో లేకపోవడంతో వారికి రాజధాని మార్పు యిష్టం లేదాన్న సందేహం కలుగుతున్నట్లే! టిడిపిలోని అన్ని ప్రాంతాల నాయకులు ముక్తకంఠంతో అమరావతికై పట్టుబడుతున్నారన్న విషయాన్ని టిడిపి యితర ప్రాంతాల్లో పెద్ద సభలు నిర్వహించడం ద్వారా చాటాలి. లేకపోతే సందేహాలకు తావిచ్చినట్లే. 

''హిందూ''లో సురేంద్ర మంచి కార్టూన్‌ వేశారు. 'అమరావతి గేటెడ్‌ కమ్యూనిటీ' అని చంద్రబాబు ఒక కోట లాటిది కట్టుకుని ఉంటారు. జగన్‌ ఆ కాంపౌండు గోడలో ఒక్కో యిటికా తరలించుకుని పోతూంటే గోడ తగ్గిపోతోంది. అది చూసి చంద్రబాబు కేకలు వేస్తున్నారు. నిజంగానే అమరావతిని సొంత యిలాకాగా బాబు తీర్చిదిద్దుకున్నారు. పరులకు ప్రవేశం లేదు, ఎవరైనా రావాలన్నా తమ అనుమతి ఉండాలనే తరహాలో దాన్ని దుర్భేద్యం చేసుకున్నారు. ఇవాళ్టి గైరుహాజరీ తర్వాత నాకు తోస్తోంది – టిడిపి కోట విస్తీర్ణం తగ్గిపోతూ, తగ్గిపోతూ రెండే రెండు జిల్లాలకు పరిమితమై పోతోందా? అని. ఆ రెండు జిల్లాలలో ప్రజలందరూ బాబు లాగే అలోచిస్తున్నారనీ, ఆయన పద్ధతులను ఆమోదిస్తున్నారనీ అర్థం కాదు. 

నేను తెలంగాణవాసిని. 'ఆంధ్రావాలే భాగో' అని నినదించిన భాగానికి చెందినవాణ్ని. అందువలన 'మీ తెలంగాణ వాళ్లు అలా అన్నారు..' 'మీరు హైదరాబాదులో కూర్చుని ఆంధ్ర రాజధాని మీకు పోటీ రాకూడదని ఆశిస్తున్నారు.' వంటి ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తోంది. ఇది కలెక్టివ్‌ రెస్పాన్సిబిలిటీ. అమరావతి ఉద్యమం ఆ రెండు జిల్లాలలోనే (అది కూడా కొన్ని గ్రామాల్లోనే) నడుస్తోంది కాబట్టి వాటి ప్రస్తావన వస్తోంది కానీ ఆ రెండు జిల్లాల వారికే అమరావతి కావాలని కానీ, జిల్లాలో ఉన్న వారందరికీ హైకోర్టు సైతం తరలకూడదని ఉందని కాని నా అభిప్రాయం కాదు. ఏ జిల్లా వాసులైనా సరే, అమరావతిలో ఫైనాన్షియల్‌ స్టేక్‌ ఉన్నవాళ్లకి  రాజధాని కదలకూడదని, అక్కడ అద్భుత నగరం వెలవాలనీ కోరిక ఉండడం సహజం. దాని కోసం తమ జిల్లాలలో ఆందోళనలు నిర్వహించ లేరు కాబట్టి, అమరావతి ఉద్యమానికి మద్దతు యిస్తూంటారు. 

టిడిపి విషయానికి వస్తే యికనైనా చంద్రబాబు తన విధానంపై పునరాలోచించుకోవాలి. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాదు మీదే దృష్టి పెట్టారు. సైబరాబాదుని వృద్ధి చేశారు. బిల్‌ క్లింటన్‌ను తెచ్చారు, ఫ్లయి ఓవర్లు కట్టారు అంటూ మీడియా ఆకాశానికి ఎత్తేస్తే అది చూసి మురిసిపోయారు. అవతల గ్రామీణ ప్రాంతాల ప్రజలు కునారిల్లుతున్నారని పార్టీ నాయకులు చెప్పినా వినలేదు. హైదరాబాదు డెవలప్‌ అయితే మాకేంటి, మాకు నీళ్లూ నిప్పులూ లేవు కానీ. మా దగ్గర కరువు తాండవిస్తూ ఉంటే హైదరాబాదులో ఆటలకు స్టేడియం కట్టాల్సిన అవసరమేముంది? అని ఓటర్లు కోపగించుకున్నారు. 2004 ఎన్నికలలో దారుణంగా ఓడించారు. చివరకు హైదరాబాదులో జనం కూడా టిడిపికి ఓటేయలేదు. 

2014లో అధికారం రాగానే బాబు అమరావతి జపం చేశారు. తక్కిన జిల్లాల వారికి యిది హర్షం కలిగించే విషయం కాకపోవడం వలన 2019లో ఓడారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా ఓట్లేయలేదు. అయినా బాబు అది గుర్తించకుండా యిప్పటికీ తెల్లవారి లేస్తే అమరావతి అంటున్నారు. హైకోర్టు సైతం వదులుకోవడానికి సిద్ధపడటం లేదు. ఈ పక్షపాత బుద్ధి వలన తక్కిన జిల్లాలలో టిడిపి పట్ల వ్యతిరేకత కలుగుతుందన్న వివేకం లోపిస్తోంది. అన్నీ ఒకే చోట పెట్టడం తప్పని ఓటర్లు చెప్పారు కదా అంటే కేవలం ఆ ఒక్క అంశంపై రిఫరెండం పెట్టమని బాబు యిప్పుడు అడుగుతున్నారు. ఆయన హయాంలో పెట్టారా? 'అన్నీ ఒకేచోట పెడతాను. వైద్యసదుపాయాలు పుష్కలంగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలకే ఎయిమ్స్‌ కూడా పట్టుకుపోతాను. ఓకేనా?' అని అడిగారా? జనరల్‌ ఎన్నికలలో ఓటర్ల తీర్పు అనేక అంశాలపై ఉంటుంది. తీరిగ్గా ఆలోచిస్తే సారాంశం బోధపడుతుంది. కాదూ, నేనూ నా సన్నిహితుల పెట్టుబడులు కాపాడుకోవడం మాకు పార్టీ కంటె ముఖ్యం అనుకుంటే ఆయనిష్టం.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2020)
[email protected]