బీబీసీని చూసైనా తెలుగు మీడియా సిగ్గు పడాల్సిన తరుణమిది. అంతర్జాతీయంగా పేరుగాంచిన బీబీసీ వార్తా సంస్థ అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబ్ బ్రియాంట్ దుర్మరణ వార్తకు సంబంధించి ప్రసారంలో దొర్లిన తప్పిదానికి క్షమాపణలు చెప్పి తన ఔన్నత్యాన్ని, జర్నలిజం విలువలను కాపాడింది.
తప్పు చేయడం తప్పు కాదు. కానీ, తప్పును సరిదిద్దుకోక పోవడమే క్షమించరాని తప్పు అవుతుంది. బీబీసీ విషయానికి వస్తే బాస్కెట్‌బాల్ ప్లేయర్ మరణ వార్తకు సంబంధించి ఉదయం పది గంటల బులిటెన్‌లో ప్రసారం చేసింది. ఈ వార్తలో మృతుడికి బదులు లిబ్రోన్ జేమ్స్ చిత్రాలను చూపారు. జేమ్స్, కోబ్ కెరీర్ పాయింట్లను అధిగమిస్తున్న వార్తను ప్రసారం చేశారు. నిజానికి ఇది పొరపాటున జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు.
అయితే ఈ కథనాన్ని బీబీసీలో చూసిన వీక్షకులు…ఓ ప్రసిద్ధ ప్లేయర్ మృతి వార్త ప్రసారంలో నిర్లక్ష్యాన్ని తప్పు పడుతూ బీబీసీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో బీబీసీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే బీబీసీ తన విజ్ఞతను ప్రదర్శించింది. అదే బులిటెన్ చివర్లో న్యూస్ రీడర్ రీతా చక్రవర్తి జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. అలాగే బీబీసీ ఎడిటర్ (సిక్స్ అండ్ టెన్) పాల్ రాయల్ ట్విటర్ కూడా క్షమాపణలు చెప్పి హూందాతనాన్ని ప్రదర్శించారు.
ఇదే తెలుగు మీడియా అయితే ఉద్దేశ పూర్వకంగానే వార్తలు రాయడం, కథనాలు ప్రసారం చేయడం సర్వసాధారణమైంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి…ఇలా ఏ పత్రిక, చానల్ ఇందుకు అతీతం కాదు. కనీస పాత్రికేయ విలువలను కూడా తెలుగు మీడియా సంస్థలు పాటించడం లేదు. తమకు అనుకూలమైన రాజకీయ నాయకుల కొమ్ము కాస్తూ భజన చేయడం లేదా పాతాళానికి తొక్కేయాలనే ఆత్రుతలో విలువలను రోజురోజుకూ దిగజార్చుకుంటున్నాయి.
బీబీసీలా ఏనాడైనా ఈ సంస్థలు తమ తప్పు తెలుసుకుని లెంపలేసుకుంటాయనే ఆలోచన కూడా దురాశే అవుతుందేమో. ఎందుకంటే బీబీసీ అనేది ప్రపంచ ప్రసిద్ది చెందడానికి …అది సంపాదించిన విశ్వసనీయతే ప్రధాన కారణం. మరి మన తెలుగు మీడియా సంస్థలంటారా…వద్దులే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.