దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ లోపాయి కారీగా బీజేపీకి సపోర్ట్ చేసిందనే వాదన ఒకటి ఉంది. తాము ఎలాగూ గెలిచే పరిస్థితి లేని నేపథ్యంలో ఊపు మీద కనిపిస్తున్న బీజేపీ అభ్యర్థిని కాంగ్రెస్ వెనక నుంచి తోసిందనే టాక్ ఉంది.
అలాగే కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నా.. అతడు ముహూర్తం చేసి టీఆర్ఎస్ లోకి చేరతాడనే ప్రచారాన్ని బీజేపీ గట్టిగా చేసింది. ఇది వరకూ కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్లు, గెలిచిన వెంటనే కారెక్కినట్టుగా దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచినా అదే జరుగుతుందనే అభిప్రాయం ప్రజల్లోనూ ఏర్పడింది. ఈ అభిప్రాయం టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు సాలిడ్ గా బీజేపీ పడేలా చేసింది.
కాంగ్రెస్ పార్టీని ముంచడానికి కాంగ్రెస్ పార్టీ నేతలే చాలనే మాట కొత్త దేమీ కాదు. ఆ క్రమంలోనే దుబ్బాకలో కాంగ్రెస్ ను ముంచేసిన ఘనత ఆ పార్టీ నేతలకే దక్కుతోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమనే అభిప్రాయాలకు ఆ పార్టీలోని నేతలు మరింత మంది వచ్చే అవకాశాలు లేకపోలేదు.
ఈ లెక్కలతో కాంగ్రెస్ ను ఖాళీ చేసి బీజేపీ పంచన చేరడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నాడనే ప్రచారం ఊపందుకుంటోంది. అందుకే రేవంత్ ఇప్పుడు కొత్త అల్టిమేటం పెడుతున్నాడట. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తేనే కాంగ్రెస్ లో ఉండటం లేకపోతే కమలం పార్టీలోకి చేరడం అనే వాదన వినిపిస్తున్నారట రేవంత్ రెడ్డి. పార్టీలు మారడం రేవంత్ రెడ్డికి కొత్తేమీ కాదు.
తెలంగాణలో టీడీపీ కథ ఖతం అయ్యాకా ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ కోలుకోలేదనే లెక్కలతో బీజేపీలోకి చేరినా చేరగలడు. ఎలాగూ వచ్చే వాళ్లను చేర్చుకోవడానికి బీజేపీ ఉబలాటపడుతూ ఉంది.
రెడ్డి ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి రేవంత్ పనికొస్తాడనే లెక్కలు బీజేపీ వద్ద ఉండనే ఉంటాయి. అయితే రేవంత్ పార్టీ మారితే.. ఉప ఎన్నిక తప్పకపోవచ్చు. లోక్ సభలో ఫిరాయించి పబ్బం గడపడం అంత తేలిక కాదు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది కాబట్టి.. రేవంత్ పార్టీ మారితే ఉప ఎన్నికలకు రెడీ కావాల్సి ఉంటుంది. అది ఆయన చేరికకు ఆటంకం కావొచ్చు.