కాసేపు వీరహిందుత్వ వాదాన్ని అందుకుంటోంది, మరి కాసేపు మైనారిటీల హక్కుల పరిరక్షణ అని నినదిస్తోంది! దళితులపై దాడులు అంటోంది.. ఈ అంశాల వారీగా తెలుగుదేశం పార్టీ స్పందిస్తే దాంట్లో తప్పు పట్టడానికి వీల్లేదు. అయితే.. ప్రతి దాంట్లోనూ జగన్ ప్రభుత్వానికి, అందునా జగన్ కు ఒక వాదం ఉన్నట్టుగా జనాలను నమ్మించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది! ,
జగన్ ను కాసేపు హిందూవ్యతిరేకిగా, మరి కాసేపు దళితులపై దాడి చేయిస్తున్నట్టుగా, ఇంకాసేపు మైనారిటీలంటే జగన్ కు పడటం లేదన్నట్టుగా.. ప్రతి దాంట్లోనే ఒక తీవ్రమైన ఉద్దేశాన్ని ఆపాదించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉండటమే చోద్యంగా ఉంది.
రథం ధగ్ధం అయినప్పుడు తెలుగుదేశం పార్టీ వీర హిందుత్వవాద పార్టీగా స్పందించింది. అయితే ఆ వాదాన్ని బీజేపీ హై జాక్ చేసుకు వెళ్లిపోయింది. జగన్ అందుకు ప్రతిగా ఆ కేసును సీబీఐకి అప్పగించేశారు. ఆ రథం గురించి తేల్చాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు! సీబీఐ విచారణ ఎంత వరకూ వచ్చిందో బీజేపీ, జనసేనలకు అయినా తెలుసోతెలీదో!
ఇప్పుడు ఆ పార్టీలు ఆ అంశం గురించి స్పందించడం లేదు. అదే ఆ విచారణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నట్టుగా అయితే ఆ పార్టీల స్పందన ఎలా ఉండేదో వివరించనక్కర్లేదు. సీబీఐ విచారణ ఎంత వరకూ వచ్చింది? అనే అంశంపై బీజేపీ కానీ, జనసేన కానీ నోరెత్తితే ఒట్టు! రథం రాజకీయానికి పనికి వస్తుందేమో అని ట్రయలేశారు, పనికి రాలేదని వదిలేసినట్టుగా ఉన్నారు.
ఆ అంశాన్ని బీజేపీ హైజాక్ చేసుకుని వెళ్లడంతో.. దళితులపై దాడులు అంశంలో టీడీపీ కాసేపు లాగి చూసింది. ఊర్లలో చిన్నచితక గొడవల్లో ఎవరైనా కొట్టుకుంటే వాటిల్లో కూడా కుల కోణాలను లాగి తెలుగుదేశం పార్టీ జగనే సచివాలయం నుంచి ఆ గొడవలను చేయించి దళితులపై దాడి చేయిస్తున్నాడు అన్నట్టుగా తెలుగుదేశం రియాక్ట్ అయిపోతోంది.
ఇక నంద్యాల ఘటనను మైనారిటీలపై వ్యవస్థీకృతమైన దాడిగా టీడీపీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. తీరా.. ఆ కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించింది ప్రముఖ టీడీపీ నేతే అని తేలడంతో డిఫెన్స్ లో పడింది.
ఒక్కో సంఘటనపై స్పందిస్తే ప్రతిపక్షంగా టీడీపీ తన బాధ్యతను నెరవేర్చినట్టుగా అవుతుంది. అలా కాకుండా.. ఒక్కో అంశంలోనూ ఒక్కో వాదానికి తెరలేపి.. ఏకంగా తీవ్రమైన ఉద్ధేశాలను అంటగట్టాలని చూస్తుండటంతోనే తెలుగుదేశం ప్రయత్నాలు నీరు గారిపోతున్నాయి.
ప్రతిపక్షంలోకి పడి ఏడాదిన్నర కావొస్తున్నా టీడీపీ ఇంకా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వ్యవహరిస్తోంది తప్ప అంతకు మించిన విధానమేది దానికి లేనట్టుగా ఉంది!