బిహార్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీ చాలా చేటు చేసింది.. అనే వాదన బలంగా వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ కు ఉత్తరాదిన గెలిచే చేవ ఇప్పుడు లేదని.. అది అర్థం చేసుకోలేక ఆ పార్టీకి 70 సీట్లను కేటాయించి ఆర్జేడీ తప్పు చేసిందనే విశ్లేషణలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఆర్జేడీ తమకు కేటాయించిన సీట్లలో కమ్యూనిస్టులు నెగ్గిన వైనాన్ని, కాంగ్రెస్ పార్టీ చతికిలపడ్డ వైనాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తూ ఉన్నారు.కాంగ్రెస్ అంటేనే ఉత్తరాదిన ఒక విముఖత ఏర్పడిందని, ఆ పార్టీతో చేతులు కలిపితే బీజేపీ వ్యతిరేక పార్టీలకు కూడా దెబ్బ పడుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఇది వరకూ బీజేపీ వ్యతిరేక కూటమి చేతులు కలిపితే ఆ పార్టీని ఓడించవచ్చు అనే మాట వినిపించేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ను పక్కన పెడితేనే బీజేపీ వ్యతిరేక ఓటుకు ఊపు వస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. మరి ఇదెంత వరకూ నిజమో కానీ.. అప్పుడే ఇందుకు సంబంధించిన పరిణామాలు మొదలయ్యాయి.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించినట్టుగా వార్తలు వస్తున్నాయి. గత టర్మ్ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ కు వంద వరకూ సీట్లను ఇచ్చి బరిలోకి దిగాడు అఖిలేష్. అయితే ఈ జోడీ చతికిల పడింది. బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కూడా పరిస్థితి మారలేదు. మళ్లీ బీజేపీ హవానే కొనసాగింది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను ప్రకటిస్తూ.. కాంగ్రెస్ తో పొత్త ఉండదని, చిన్న పార్టీలతోనే పొత్తు అని అఖిలేష్ స్పష్టం చేశారట. తమతో విబేధించి బయటకు వెళ్లిన తమ చిన్నాన్న ఒకాయనను కలుపుకోనున్నట్టుగా కూడా ప్రకటించారట.
మరి అఖిలేష్ వ్యూహం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో కానీ.. కాంగ్రెస్ అంటే సాటి రాజకీయ పార్టీలు కూడా భయపడిపోయే పరిస్థితి మాత్రం ఏర్పడినట్టుగా ఉంది!