టీడీపీ యువ నేత నారా లోకేశ్‌కు ఎంత కుళ్లో, పదవి పోతే తప్ప జనానికి అర్థం కాలేదు. తన పదవి ఊసిపోతోంది కాబట్టి, ప్రత్యర్థి పార్టీ వారివి కూడా ఊడాల్సిందేననే అక్కసు ఆయన మాటల్లో ప్రతిబింబిస్తోంది. మండలి రద్దు అయి కనీసం ఒక్కరోజు కూడా గడవకనే లోకేశ్ కారాలుమిరియాలు నూరుతున్నాడు.
శాసన మండలి రద్దు ప్రతిపాదనను అసెంబ్లీ ఆమోదించిన దృష్ట్యా కౌన్సిల్ సభ్యులైన ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశాడు.
మంత్రులిద్దరితో పాటు వైసీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్సీలు కూడా వెంటనే సభ్యత్వాన్ని వదులుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. వీరితో పాటు తమ పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీలతో కూడా వెంటనే రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశాడు.
ఇంతకూ వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులిద్దరు, టీడీపీ నుంచి వెళ్లిపోయిన ఇద్దరు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్న లోకేశ్, తాను ఎప్పుడు రాజీనామా చేస్తాననే విషయాన్ని మాత్రం చెప్పలేదు. పదవి పోతున్నదనే ఆక్రోశం లోకేశ్‌తో ఏదేదో మాట్లాడిస్తోంది.