వారు బాబు వీర విధేయులు. పసుపు రంగు అంటే మైమరపు. సొంత గడ్డ ఎలా పోయినా ఫర్వాలేదు, బాబు బాగుంటే చాలు అనుకునే వారు, అందుకే తమ పదవులు కూడా తలకాయ కోసినంత సులువుగా తరిగి ఇచ్చేశారు. ఇపుడు గోడుమన్నా కూడా గొల్లుపెట్టినా కూడా బావుకునేది ఏదీ లేదుకదా.
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీలు గత నెల రోజులుగా తెగ హడావుడి చేశారు. అమరావతి రాజధానిని మూడుగా చేస్తూ అన్ని ప్రాంతాలకు సమాన అభివ్రుధ్ధిని చేస్తామని వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన మరుక్షణం పసుపు ఎమ్మెల్సీలు చేసిన రచ్చ ఒక్కలా లేదు.
ఉన్నది ఉత్తరాంధ్ర జిల్లాలో, బతికేది కూడా ఇక్కడే. మరి జనం కోసం మాట్లాడాల్సిన చోట అధినాయకత్వానికి భజన చేస్తూ గడిపారు. పార్టీ ఆదేశాల మేరకు నడచుకున్నారు. విశాఖలో రాజధాని వద్దు అనేశారు.
అంతేనా ఇక్కడ ప్రజలు ఎవరూ రాజధాని కోరుకోవడం లేదంటూ పచ్చి అబద్దలే ఆడారు. నిజంగా జనంలోకి వెళ్తే వారికి ప్రజల బాధలు తెలిసేవి. కానీ ఇపుడు అదేమీ లేకుండా తమ నాయకుడు చెప్పమన్నాడు, తాము చేస్తున్నామన్న తీరులో వారు వ్యవహరించారు.
శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు అడ్డుకుని తీరుతామని ముందే గర్జించారు. ఫలితంగా ఉన్న పదవులే కోల్పోయారు. చివరికీ ఏమీ కాకుండా మిగిలారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలు ఇపుడు దిగాలుపడ్డారు. వీరిలో కొందరికి 2025 వరకూ కూడా పదవి ఉంది. అంటే ముక్కుపచ్చలారకముందే కధ ముగిసిపోయిందన్నమాట.
జై అమరావాతి అన్న ఎమ్మెల్సీల సంగతి ఇలా ఉంటే వలసవచ్చి ఇక్కడే ఎమ్మెల్యేలుగా పలుమార్లు గెలిచిన వారు కూడా వీధికెక్కి జై అమరావతి, నై విశాఖ అని వీరంగమాడుతున్నారు. మరి వారి కధ ఏ తీరం చేరుతుందో చూడాలి.