మండలి రద్దుకు సై.. మరోసారి మద్దతిచ్చిన రాపాక

ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ముఖ్యమంత్రి జగన్ కు పూర్తి మద్దతు ఇస్తున్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. బడ్జెట్ నుంచి మొన్నటి ఇంగ్లిష్ మీడియం వరకు ప్రతి విషయంలో ప్రభుత్వానికి…

ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ముఖ్యమంత్రి జగన్ కు పూర్తి మద్దతు ఇస్తున్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. బడ్జెట్ నుంచి మొన్నటి ఇంగ్లిష్ మీడియం వరకు ప్రతి విషయంలో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న రాపాక, ఈరోజు ప్రవేశపెట్టిన మండలి రద్దు అంశానికి కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. 

శాసన మండలి రద్దుపై చర్చ సందర్భంగా మాట్లాడిన రాపాక, 7 నెలలుగా అభివృద్ధిపైనే దృష్టి పెట్టి వెళ్తున్న జగన్ కు “జనసేన” మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిల్లుల్ని మండలిలో టీడీపీ సభ్యులు అడ్డుకోవడం దురదృష్టం అన్న రాపాక.. అభివృద్ధి-అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని మరోసారి స్పష్టంగా చెప్పారు.

బ్రిటిష్ పాలకుల టైపులో గతంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని విభజించి పాలించారని ఆరోపించారు రాపాక. అన్నదమ్ముల్లా ఉన్న కులాల మధ్య చిచ్చుపెట్టడమే కాకుండా… అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని విమర్శించారు. అయితే జగన్ మాత్రం బాబు తరహాలో కాకుండా, అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని మెచ్చుకున్నారు. అసెంబ్లీలో అధికార పార్టీకి చెందిన 151 మంది సభ్యులతో పాటు తను కూడా సీఎం తీసుకున్న మండలి రద్దు తీర్మానాన్ని స్వాగతిస్తున్నానని ప్రకటించారు.

వైసీపీ సర్కార్ తన అన్-కండిషనల్ మద్దతు కొనసాగుతూనే ఉంటుందని సంక్రాంతి సందర్భంగా మీడియాకు స్పష్టం చేశారు రాపాక. అభివృద్ధి చేస్తానని ముందుకొచ్చినవాళ్లను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. ఇప్పటికే జగన్ తీసుకొచ్చిన ఎన్నో విధానాల్ని సమర్థించానని, ఇకపై కూడా ఇదే పంథా కొనసాగిస్తానని, ఈ విషయంలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో తనకు సంబంధం లేదని అన్నారు. చెప్పినట్టుగానే ఈరోజు కూడా జగన్ కు పూర్తి మద్దతు ప్రకటించారు రాపాక.