అనుకున్నట్లుగానే ఏపీ శాసనమండలి రద్దయిపోయింది. టీడీపీ గైర్హాజరైంది కాబట్టి దాన్ని గురించి చెప్పుకోవల్సింది ఏమీ లేదు. మండలిలో వైకాపా సభ్యులు తొమ్మిదిమంది. వారిలో ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ. వీరి మనసులో ఏముందోగాని మండలి రద్దయినందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. మండలి అధికారికంగా రద్దయ్యేంతవరకు వీరు మంత్రులుగా (మిగిలిన సభ్యులంతా) ఉంటారు కాబట్టి ఇప్పటికిప్పుడు మాజీలయ్యే ప్రమాదం లేదు. వీరిద్దరి మంత్రి పదవులు పోయినా మరోవిధంగా ప్రయోజనం కలిగిస్తానని సీఎం జగన్ చెప్పారు కాబట్టి లోపల బాధ ఉన్నా పైకి నవ్వుతూనే ఉంటారు.
ఇక జగన్‌కు వీర విధేయుడైన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండలి రద్దుయినందుకు బాగా సంతోషించినట్లు ఆయన ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోయింది. మండలి రద్దుకు మద్దతుగా సభ్యులు మాట్లాడినప్పుడు ఇతర సభ్యులతోపాటు తమ్మినేని కూడా ఆనందంతో బల్ల చరిచారు. దీన్నిబట్టే ఆయన హ్యాపీనెస్ తెలిసిపోయింది. మండలి రద్దు కోసం సభను సమావేశపరచాలని జగన్ కోరినప్పుడే తమ్మినేని మొహం వెలిగిపోయింది. ఆయన కోరుకున్నట్లు విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అయింది. దాంతోపాటు మండలి కూడా రద్దయింది. స్పీకరుకు ఇది డబుల్ ఢమాకా అని చెప్పొచ్చు.
తమ్మినేని స్పీకర్ అయినప్పటినుంచి అలా (స్పీకర్‌లా) ఎప్పుడూ వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం లేకపోతే ఎలా ఉండేదోగాని లైవ్ ఉండటంతో స్పీకర్ భావోద్వేగాలు స్పష్టంగా కనబడ్డాయి. ఆయన దేన్నీ దాచుకోలేదు. మూడు రాజధానులుపై, మండలి రద్దుపై ఎంత సంతోషాన్ని వ్యక్తం చేశారో, ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై అంతే కోపాన్ని, ద్వేషాన్ని వ్యక్తం చేశారు. ఈ భావోద్వేగాలు సభలోనే కాదు, బయటా (సభల్లో, మీడియా సమావేశాల్లో) అనేకసార్లు వ్యక్తం చేశారు. రెచ్చిపోవడం సభలో సాధ్యంకాదు కాబట్టి బయట తన వాగ్ధాటి, వాచాలత బాగా చూపించారు.
సభలో ఎమ్మెల్యేల, మంత్రుల మాదిరిగా అరిచిగీపెట్టడం కుదరదు కాబట్టి, తాను మంత్రిగా ఉన్నా బాగుండేదేమోనని అనుకొని ఉండొచ్చు. మంత్రిగానో, ఎమ్మెల్యేగానో ఉంటే ఏమాత్రం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉండదు కదా. సభలో సీఎం జగన్ ఏం చేయమంటే స్పీకర్ అదే చేస్తున్నారని, ఆయన ఆదేశాల ప్రకారమే ఈయన పనిచేస్తున్నారని టీడీపీ సభ్యులు విమర్శించారు. ఈ విమర్శలు పూర్తిగా అవాస్తవం కాదని చెప్పొచ్చు. చంద్రబాబు ప్రసంగాన్ని ఆపాలని జగన్ ఆగ్రహంగా అంటే చాలు మరుక్షణం స్పీకర్ ఆ పని చేస్తారు. టీడీపీ సభ్యుల్లో ఎవరికైన మైక్ ఇవ్వొద్దంటే చాలు వెంటనే మైక్ కట్ చేస్తారు.
'అయితే ఓకే' టైపులో వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. వైకాపాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా 18 మంది ఓటింగ్ సమయంలో లేరు. చెవిరెడ్డి ఓటింగ్ జరగడానికి ముందు బయటకు వెళ్లిపోయాడు. టీడీపీ నుంచి వైకాపా వైపుకు వచ్చిన ఇద్దరు సభ్యులు ఓటింగులో పాల్గొనలేదు. వైకాపా ఎమ్మెల్యేలంతా మండలి రద్దును స్వాగతిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో 18 మంది హాజరుకాకపోవడం విచిత్రంగా ఉంది. వీరు ఓటింగుకు దూరంగా ఉన్నారంటే మండలి రద్దును ఇష్టపడలేదని అనుకోవాలా? ఇది క్రమశిక్షణరాహిత్యం కిందికి రాదా?
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా మండలి రద్దుకు అనుకూలంగా ఓటేశాడు. మూడు రాజధానులుగాని, మండలి రద్దుగాని వైకాపా సభ్యులంతా నూటికి నూరు శాతం సమర్ధించారని చెప్పలేం. ఇది ప్రభుత్వ నిర్ణయం (ఇంకా చెప్పాలంటే జగన్ నిర్ణయం) కాబట్టి ఇష్టమైనా, కష్టమైనా సమర్థించాల్సిందే. వ్యతిరేకిస్తే బతుకు బస్టాండవుతుంది. ఇక మండలి రద్దు కావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. అప్పటివరకు మండలి జీవించే వుంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.