శాసనమండలి రద్దు బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. తెలుగుదేశం పార్టీ సభలో జాడ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏకగ్రీవంగా మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందింది. జనసేన కూడా దానికి సమ్మతం తెలియేసింది. ఇక మండలి రద్దు తీర్మానం ఢిల్లీకి వెళ్లడమే ఆలస్యం. ఒకే రోజు కేబినెట్ తీర్మానం, అదే రోజు అసెంబ్లీ ఆమోదం.. ఇక మరో మూడు నాలుగు రోజుల్లో పార్లమెంట్ సమావేశాల ప్రారంభం!
ఈ నేపథ్యంలో ఏపీ శాసనమండలి తీర్మానం చలో ఢిల్లీ అంటోంది. పార్లమెండ్ బడ్జెట్ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఇదే ఈ కథలో తదుపరి ట్విస్ట్ ఉండే అంకం!
ఈ ట్విస్ట్ గురించి తెలుగుదేశం పార్టీనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. తెలుగుదేశం దీనిపై చాలా వాదనలు వినపించింది. ముందుగా.. జగన్ తీసుకున్న నిర్ణయం కాబట్టి.. బీజేపీ దాన్ని ఆమోదిస్తుంది అనే నమ్మకం లేదు అని తెలుగుదేశం వాళ్లు అంటున్నారు. ఇక అదే సమయంలో రాష్ట్రాల నుంచి వెళ్లే తీర్మానాలు ఎన్నో పార్లమెంట్ ముందు పెండింగ్ లో ఉంటాయని, అలాంటివి ఆమోదం పొందడానికి చాలా కాలం పడుతుందనే వాదననూ టీడీపీ వినిపిస్తూ వస్తోంది. ఆ వాదనలో తెలుగుదేశం వాళ్లు టైమ్ పీరియడ్ ను కూడా తామే డిసైడ్ చేస్తూ ఉన్నారు.
పెండింగ్ లోని ఇలాంటి తీర్మానాల ఆమోదానికి ఆరు నెలల వరకూ సమయం పడుతుందని టీడీపీ వాళ్లు ఒకసారి అన్నారు. ఆ తర్వాత సంవత్సరం అని మరో ప్రకటన చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం తాజా లీక్ ప్రకారం.. ఏపీ శాసనమండలి తీర్మానం ఢిల్లీలో ఆమోదం పొందడానికి మూడేళ్లు కూడా పడుతుందట! ఇదంతా తెలుగుదేశం వాళ్ల వాదన.
అయితే అందులో పస ఎంత అనేది ఇప్పుడప్పుడే చెప్పలేని అంశం. తమ వాదనకు తెలుగుదేశం రకరకాల లాజిక్కులను చెబుతూ ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పడు మండలి ఏర్పాటు చేయాలని 2004లో అనుకుంటే అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉన్నా.. 2007 వరకూ సమయం పట్టిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశ్లేషించారట. అయితే అప్పుడు మండలి పునరుద్ధరణ విషయంలో వైఎస్ ఎంత సీరియస్ గా ప్రయత్నించారో ఎవరికి తెలుసు? మండలి రద్దును మాత్రం జగన్ సీరియస్ గా తీసుకున్నారని స్పష్టం అవుతోంది.
ఇదే సమయంలో.. పార్లమెంట్ లో వివిధ బిల్లుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తన సహకారం అందించింది. రాజ్యసభలో వైసీపీ బలం త్వరలోనే ఆరు మంది సభ్యులకు పెరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ వైసీపీ వెయిట్ పెరుగుతోంది. కేంద్రంతో జగన్ చాలా వరకూ సఖ్యతతో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం గనుక పార్లమెంట్ లో ఆమోదం పొందితే… తెలుగుదేశం పార్టీకి అది శరాఘాతమే అవుతుంది. ఒక రకంగా కాదు.. అనేక రకాలుగా!