విశాఖకు కేసీఆర్….?

భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ విశాఖకు తొందరలో రాబోతున్నారు అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విశాఖలో భారీ సభను ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. ఈ సభ…

భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ విశాఖకు తొందరలో రాబోతున్నారు అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విశాఖలో భారీ సభను ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. ఈ సభ ద్వారా ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ కోసం అడుగుపెట్టనున్నట్లుగా భోగట్టా.

మొదటి నుంచి ఉత్తరాంధ్రా జిల్లాల మీదనే కేసీఆర్ దృష్టి పెట్టారు. ఆయన పూర్వీకులది కూడా విజయనగరం జిల్లా బొబ్బిలి కావడంతో ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ కి రాజకీయ పట్టు దొరుకుతుందని ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలు విరమించుకోవాలని కేటీఆర్ మోడీకి ఈ మధ్యనే లేఖ రాశారు. ఈ నేపధ్యంలో ఈ నెల 8న ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విశాఖ రానున్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఉద్యమకారులతో భేటీ అవుతారని తెలుస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలను పూర్తిగా తెలుసుకుని అధినాయకత్వానికి నివేదిస్తారని అంటున్నారు. సాధ్యమైంత త్వరలో విశాఖలో స్టీల్ ప్లాంట్ వ్యతిరేక సభను నిర్వహించడం ద్వారా ఏపీలో తమ రాజకీయ భూమికను స్థిరపరచుకోవాలని కేసీఆర్ ప్లాన్ గా ఉందని అంటున్నారు.

జనసేన తరఫున 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన పార్ధసారధి బీఆర్ఎస్ లో ఇప్పటికే  చేరారు. విశాఖ సహా ఉత్తరాంధ్రాలో బీఆర్ఎస్ వైపు ఎవరెవరు మొగ్గు చూపిస్తారు అన్న దాని మీద తోట చంద్రశేఖర్ ఈ పర్యటనలో అంచనా వేసుకుంటారని అంటున్నారు. తోటకు మిత్రుడు అయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద బీఆర్ఎస్ తీసుకున్న ఉద్యమ కార్యాచరణను స్వాగతించారు. ఆయనతో కూడా తోట భేటీ అవుతారని అంటున్నారు. విశాఖకు కేసీఆర్ రావడం అన్న ప్రచారం ఇపుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.