నాలుగేళ్లు గడచిపోయినా పవన్ కల్యాణ్ ను జంట ఓటములు ఇంకా పీడకలలాగా వెంటాడుతూనే ఉంటాయి. ఓటమిని ధైర్యంగా స్వాగతించిన చారిత్రాత్మక ధీరోదాత్తుడిలాగా తనను తాను ప్రొజెక్టు చేసుకోవడానికి ఆయన బహిరంగ వేదిక ఎక్కిన ప్రతిసారీ.. ఎప్పుడో 2019 ఎన్నికల నాటి తన ఓటములను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రజలు వాటిని గుర్తు చేసుకుని తన పట్ల జాలి, గేలి చూపించకముందే, తానే వాటి గురించి చెబుతుంటారు.
ఆ రకంగా పవన్ కల్యాణ్ నాలుగేళ్ల కిందటి ఓటములను ఇంకా మరచిపోలేదు. ఓడిపోయాడు గనుక- ప్రతి విజయం ఒక ఓటమితోనే ప్రారంభం అవుతుంది అంటే చవకబారు పర్సనాలిటీ డెవలప్మెంటు ఉపన్యాసాలు చెప్పే పవన్ కల్యాణ్.. తెలంగాణ వరంగల్ లో ఎన్ఐటి వారి స్ప్రింగ్ ఫ్రీ కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు. వాళ్లేమీ ఆయన ఓటర్లు కాదు.
తెలంగాణ ఎన్నికల్లో పార్టీని బరిలోకి దింపేంత ధైర్యం, దమ్ము పవన్ కల్యాణ్ కు లేవు. కాబట్టి వారితో రాజకీయ ప్రసంగాలు చెప్పడం దండగ. పైగా కేసీఆర్ పాలనను తిట్టాలంటే కూడా పవన్ కు భయమే.
ఇన్న ఇబ్బందుల మధ్యలో పవన్ మళ్లీ తన రొటీన్ ఓటముల ప్రస్తావనతో ప్రసంగం సాగించారు. ఒక ఫెయిల్యూర్ విజయానికి ఎలా పునాది వేస్తుందో.. ఒక ఫెయిల్యూర్ ఎలా మనల్ని తీర్చిదిద్దుతుందో ఆయన చాలా రకాలుగా అక్కడి పిల్లలకు వివరించారు. ఆయన గోలంతా వింటే.. తనను తాను తీర్చిదిద్దుకోవడానికి, బలమైన పునాది పడడానికి పవన్ కల్యాణ్ కావాలని ఓటమిని కొని తెచ్చుకున్నాడేమో, ఓడిపోవడం కోసమే, ఓడిపోయేలాగానే పోటీచేశాడేమో అనే అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది.
అయితే, పవన్ ఫెయిల్యూర్ ప్రసంగం విన్నవారు మాత్రం నవ్వుకుంటున్నారు. ‘‘స్క్రిప్టు దాచుకో పవన్.. మళ్లీ మళ్లీ నీకు ఉపయోగపడుతుంది’’ అని ఆయన గురించి జోకులు వేస్తున్నారు. 2024 తర్వాత ఇదే ప్రసంగాన్ని మళ్లీ మళ్లీ అనేక చోట్ల చెప్పుకోవాల్సి ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా దాచుకోవాలని అంటున్నారు.
చేతగాని డ్యాన్సర్ మ్యూజిక్ చెత్తగా ఉందని అన్నదనేది పాతసామెత. ‘చేతగాని డ్యాన్సరు.. అవతకవతకగా డ్యాన్సు చేయడం ఓ అదృష్టం, అద్భుతం, తర్వాత్తర్వాత గొప్ప డ్యాన్సులు చేయడానికి అదే సరైన పద్ధతి’ అంటూ బుకాయించడం ఇప్పుడు పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న తీరు!!