ఉద్యోగులతో పెట్టుకుంటే.. ఎన్నికల్లో వారి ఉసురు తగలడం గ్యారెంటీ. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి ఉద్యోగుల శాపం కూడా పరోక్ష కారణంగా నిలిచిందనేది ఓ విశ్లేషణ. వీఆర్వోలను ఏకపక్షంగా పీకిపారేసి, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళణ చేసినట్టు ఫోజులిచ్చారు కేసీఆర్.
ఆ నిర్ణయంతో తెలంగాణలోని అవినీతి అంతా ఏరిపారేసినట్టు భారీ డైలాగులు కొట్టారు. సామాన్య ప్రజానీకంలో కొంతమంది ఈ నిర్ణయంతో సంతోషపడొచ్చు కానీ.. వారికిది ఓట్లు త్యాగం చేసేంత పెద్ద సంగతేం కాదు.
అదే సమయంలో రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, బంధుగణం.. అందరూ కేసీఆర్ కి బద్దశత్రువుల్లా మారిపోయారు. వారి జీవితంలో టీఆర్ఎస్ కి ఇక ఓటు వేయరేమో అనేంతగా శత్రుత్వం పెంచుకున్నారు. అదంతా దుబ్బాక ఎన్నికల్లో ప్రతిఫలించింది. అధికార పార్టీ అలసత్వానికి ఇది పరోక్షంగా తోడై సింపతీతో సింపుల్ గా గెలవాల్సిన సీటుని చేజార్చింది.
కట్ చేస్తే.. ఇప్పుడా పాపాన్ని కడిగేసుకోడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. రెవెన్యూలో ఉన్న అసంతృప్తిని మున్సిపల్ ఉద్యోగులకు వరాలిచ్చి భర్తీ చేయాలని చూస్తోంది టీఆర్ఎస్ సర్కార్. పారిశుధ్య సిబ్బందికి అడక్కుండానే నెల జీతం 3వేల రూపాయలు పెంచడాన్ని ఎన్నికల జిమ్మిక్కుగా కాక ఇంకెలా చూడాలి.
ఒక్క ఉద్యోగులకు వరాలిస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి అనుకున్నారేమో.. వరదసాయం మరో 100 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నారు. మీ సేవా కేంద్రంలో పేరు, ఇంటి నెంబర్, ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఇస్తే చాలు.. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారికి ఖాతాల్లో నేరుగా పరిహారం సొమ్ము జమ అవుతుందట.
కార్పొరేటర్లు, కార్యకర్తల చేతికి ఇచ్చి పంచిపెట్టిన వ్యవహారం బెడిసి కొట్టడంతో నేరుగా ఇలా ఎన్నికల ముందు పాప పరిహారాన్ని ఓటర్ల అకౌంట్లకే బదిలీ చేస్తున్నారనమాట. అన్నిటికంటే హైలెట్ ఏంటంటే.. ఏడాది ఆస్తిపన్నులో 50శాతం రాయితీగా ప్రకటించడం. మధ్యతరగతి ప్రజలకు ఇది భారీ ఊరట కలిగించే అంశం.
గ్రేటర్ ఫలితం తేడాగా వస్తుందన్న భయంతోనే సరిగ్గా ఎన్నికల ముందు ఈ జిమ్మిక్కులన్నీ చేస్తోంది టీఆర్ఎస్ సర్కార్. ఇప్పటికే వివిధ రూపాల్లో తెచ్చుకున్న సర్వేలన్నీ గ్రేటర్ లో పట్టు తగ్గిందనే వాస్తవాల్ని కళ్లకు కట్టడంతో కిందా మీదా పడిపోతున్నారు కేసీఆర్.
దుబ్బాకను లైట్ తీసుకున్నా.. హైదరాబాద్ లో పట్టు కోల్పోతే.. అంతకంటే టీఆర్ఎస్ కి ఇంకో పరాభవం ఉండదు. సిటీలో బీజేపీ బలపడితే.. వచ్చే ఎన్నికలనాటికి కేసీఆర్ అండ్ కో.. కి చుక్కలు చూపెట్టడం ఖాయం. అందుకే బల్దియా ఎన్నికల కోసం సర్వశక్తుల్ని ఒడ్డుతున్నారు కేసీఆర్. ఎంఐఎంతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు, తాయిలాల విషయంలో ఉదారంగా ఉంటున్నారు.