బిగ్‌బాస్ రియాల్టీ షో పదో వారానికి చేరుకుంది. అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడుతూనే ఉంది. ఈ షోలో క్రియేటివీ కొరవడడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శని, ఆదివారాల్లో మినహాయిస్తే మిగిలిన రోజుల్లో ఈ రియాల్టీ షో చూడాలన్న ఆసక్తి కూడా ఎవరికీ లేకుండా పోయింది.
వారాంతాల్లో కూడా ఈ షోకు చెప్పుకోతగ్గ రేటింగ్స్ రాలేదని సమాచారం. దీనికి కారణం బిగ్‌బాస్ షో నడిచే తీరులో సస్పెన్స్ లేకపోవడం, ఒకవేళ అలాంటిదేమైనా ఉన్నా ….అదంతా ఫేక్ అని ప్రేక్షకులు వెంటనే పసిగడుతుండడంతో అందులో మజా లేకపోయింది.
తాజాగా నిన్న రాత్రి కూడా ఇదే జరిగింది. అఖిల్ ఎలిమినేషన్ అవుతున్నట్టు బిగ్‌బాస్ ప్రోమోలతో ఇచ్చిన బిల్డప్ ….అంతా ఫేక్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నట్టుగా, అదే నిజమైంది. కేవలం కంటెస్టెంట్ల మధ్య గొడవ సృష్టించడానికి అఖిల్ ఎలిమినేషన్ డ్రామా క్రియేట్ చేశారని ప్రేక్షకులు పసిగట్టారు.
సీక్రెట్ రూంలో ఉన్న అఖిల్‌తో ఎలిమినేట్ అయినట్టు చెప్పడం, అతను వెక్కివెక్కి ఏడ్వడం కాస్తా మెలోడి డ్రామా శ్రుతి మించి, ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.
ఆ తర్వాత హౌస్‌లో ఇద్దరు మిత్రులు, నలుగురు శత్రువులెవరో చెప్పాలని అఖిల్‌ను నాగార్జున కోరారు. ఈ సందర్భంగా తన శత్రువులుగా అభిజిత్, లాస్య, హారిక, మెహబూబ్‌లను ఎంపిక చేసుకున్న అఖిల్, వాళ్లకు సుతిమెత్తగానే గట్టి క్లాస్ ఇస్తాడు. దీని కోసమే అఖిల్ ఎలిమినేషన్ డ్రామాను నడిపినట్టు చివరాఖరుకు ప్రేక్షకులు గుర్తించారు.
రేటింగ్స్ పెంచుకోడానికి ఫేక్ ఎలిమినేషన్ లేదా సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారని ప్రోమోలతో అట్రాక్ట్ చేసుకోలేరని సగటు ప్రేక్షకుల అభిప్రాయం. ఫేక్‌లతో బిగ్‌బాస్ రియాల్టీ షో అనే పేకమేడను నిర్మించాలనుకోవడం ….అసలుకే ఎసరు తెస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.