జగన్ కేబినెట్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక నేత. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయనకు మొదటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో బద్ధ విరోధం. ఎస్వీ యూనివర్సిటీలో బాబు, పెద్దిరెడ్డి విద్యార్థి రాజకీయాల నుంచి ప్రత్యర్థులే.
తాజాగా ఒక చానల్‌కు ఇచ్చిన ఇంర్వ్యూలో ఏపీ రాజకీయాలపై సూటిగా, స్పష్టంగా తన మనసులో మాటను బయట పెట్టారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి పెద్దిరెడ్డి ….జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్నకు ….ఇలాంటి వాటికి జవాబు ఎలా చెప్పాలో అర్థం కాదని నవ్వుతూ సెలవిచ్చారు. ఇంతకూ ఆ ప్రశ్న ఏంటి? దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పెద్దిరెడ్డికి తెలియని జవాబు ఏంటి? అనే వివరాలు తెలుసుకుందాం.
చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పాన్ని టార్గెట్ చేశారా? అనే ప్రశ్నకు ఔను అక్కడ తమ పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని ఆయన ధీమాగా చెప్పారు.
ఒకవేళ కుప్పానికే చంద్రబాబు వెళ్లకపోతే ఆయన ఎమ్మెల్యే కాలేరని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. దివంగత ఎన్టీఆరే ఆయన్ని నాయకుడిగా నిలబెట్టారన్నారు. తాను మాత్రం బాబును నాయకుడిగా గుర్తించనని తేల్చి చెప్పారు. ఎన్నికల లోపు కుప్పానికి నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో చంద్రబాబు తనయుడు లోకేశ్ వరద ప్రాంతాల్లో పర్యటించారని, ఆయన నాయకత్వంపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారనే ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి బిగ్గరగా నవ్వారు. అసలు లోకేశ్ ఒక నాయకుడేనా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రాపకంతో ఆయన బయటికొచ్చారన్నారు. లోకేశ్ గురించి మాట్లాడ్డం తన వయస్సుకు తగింది కాదని ఆయన అన్నారు.
తెలంగాణలో దుబ్బాక విజయాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో విజయం సాధిస్తామని బీజేపీ నమ్మకం వ్యక్తం చేస్తోందని అనుకోవచ్చా అనే ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి నిండుగా, గట్టిగా నవ్వారు. ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఎలా చెప్పాలో అర్థం కాదని పెద్దిరెడ్డి నవ్వుతూ జవాబిచ్చారు. కనీసం కలలో అయినా అక్కడ గెలుస్తుందని బీజేపీ ఊహిస్తుందా? అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించడం గమనార్హం.
మొదటి నుంచి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట అని అన్నారు. ప్రస్తుతం తమ పార్టీకి తిరుపతి పార్టమెంట్ స్థానం పెట్టని కోట అని తేల్చి చెప్పారు. ఇక తెలంగాణలోని దుబ్బాక ఒక్కచోట గెలిచినంత మాత్రాన ఆ రాష్ట్రంలో పాగా వేస్తామనుకోవడం దురాశ అవుతుందని పెద్దిరెడ్డి అన్నారు.