హీరోయిన్లను తిండి గురించి అడిగితే బిల్డప్ ఇస్తారు. చాలా తక్కువ తింటామని, నాన్-వెజ్ కు దూరంగా ఉంటామని ఇలా రకరకాలుగా చెబుతుంటారు. ఈ క్రమంలో వెరైటీ పేర్లు కూడా వినిపిస్తుంటారు. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం వీటన్నింటికీ రివర్స్. తను పుట్టిందే తినడం కోసం అంటోంది పాయల్.
“ఫిట్ నెస్ కంటే ఫుడ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. కొన్ని రోజుల కిందట మోకాలికి దెబ్బ తగిలింది. అప్పట్నుంచి చిన్న చిన్న వర్కవుట్స్ కూడా చేయడం మానేశాను. దీంతో 5 కేజీలు బరువు పెరిగాను. అయినా నాకు బాధ లేదు. బాగా తింటాను నేను. పిజ్జా, దోశ ఎక్కువగా తింటాను. ఇవే కాదు, నచ్చినవన్నీ తింటుంటాను. ఒక్కముక్కలో చెప్పాలంటే పొద్దున లేస్తే ఏం తినాలా అని ఆలోచిస్తుంటాను.”
ఇలా తిండిపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది పాయల్. తెలుగు రాష్ట్రాల్లో మాస్ జనాలు తనను బాగా ఇష్టపడుతున్నారని, అలాంటప్పుడు బాగా తగ్గిపోయి, స్లిమ్ అవ్వడం తనకు ఇష్టం లేదంటోంది. ఎప్పటికీ ఇలానే ఫిట్ గా, కాస్త బొద్దుగా కనిపిస్తానంటోంది.
“తినడమే కాదు, వంట చేయడం కూడా ఇష్టమే. ఒత్తిడి ఫీల్ అయినప్పుడు వంట చేస్తుంటా. మా ఇంట్లో వారానికి ఒకసారైనా నేను వంట చేస్తా. నేను పంజాబీ కాబట్టి నాకు రాజ్మా రైస్ అంటే చాలా ఇష్టం. పైగా నేను వెజిటేరియన్. కాబట్టి వెజ్ వంటకాలన్నీ లాగించేస్తా. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా వెజ్ వెరైటీలు ట్రై చేస్తున్నాను.”
అయితే ఎంత తిన్నా అప్పుడప్పుడు ఎక్సర్ సైజులు కూడా చేయాలంటోంది పాయల్. కేవలం హీరోయిన్లు మాత్రమే కాదని, ఎవరైనా ఇదే రూల్ పాటించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని చెబుతోంది. ఆహార నియమాలు పెట్టుకోకుండా, వ్యాయామ నియమాలు పెట్టుకుంటే మంచిదని సూచిస్తోంది. త్వరలోనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో మళ్లీ కలుస్తానంటోంది ఈ డిస్కో బ్యూటీ.