అసెంబ్లీకి హాజరుకాని బాబు.. అసలు కారణం ఇది!

చంద్రబాబుతో సహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఈరోజు అసెంబ్లీకి రాలేదు. ఇదేదో పెద్ద వ్యూహం అయినట్టు నిన్నటి నుంచీ వారి అనుకూల మీడియా కోడై కూసింది. శాసనమండలి గురించి శాసన సభలో చర్చ జరగడం…

చంద్రబాబుతో సహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఈరోజు అసెంబ్లీకి రాలేదు. ఇదేదో పెద్ద వ్యూహం అయినట్టు నిన్నటి నుంచీ వారి అనుకూల మీడియా కోడై కూసింది. శాసనమండలి గురించి శాసన సభలో చర్చ జరగడం మాకిష్టం లేదు, అందుకే మేం రావడంలేదని టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే అసలు కథ ఈరోజు అసెంబ్లీలో బైటపడింది.

చంద్రబాబు సభకు ఎందుకు రాలేదనే విషయం సమావేశాలు చూసిన రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. 

గతంలో వైఎస్ఆర్ హయాంలో శాసనమండలిని పునరుద్ధరించే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మండలి గురించి తన “అమూల్యమైన” సందేశాన్ని అప్పటి సభలో చదివి వినిపించారు. శాసనమండలి ఎందుకు వద్దంటున్నారో సవివరంగా వివరించారు. కేవలం తమ నేతలకు రాజకీయంగా పునరావాసం కల్పించడానికే వైఎస్ఆర్ శాసనమండలి వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారంటూ అప్పట్లో మండిపడ్డారు బాబు. మండలి వల్ల రాష్ట్రానికి ప్రత్యేక ప్రయోజనాలేవీ లేవని తేల్చి చెప్పారు. గతంలో అక్షరాస్యత తక్కువగా ఉన్నరోజుల్లో  విద్యావంతులు, మేథావులకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు శాసన మండలి వ్యవస్థ పెట్టారని అన్నారు బాబు. అక్షరాశ్యత పెరిగింది కాబట్టి, అసెంబ్లీకి కూడా విద్యావంతులే వస్తున్నారు కాబట్టి మండలి వద్దన్నారు. 

మరి ఇప్పుడు అక్షరాస్యత ఇంకా పెరిగింది కదా. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నవాళ్లలో ఉన్నత విద్యావంతులే ఎక్కువమంది ఉన్నారు కదా. మరిప్పుడు బాబు మండలిని ఎందుకు కావాలని కోరుతున్నట్టు? ఎందుకనే విషయం అందరికీ తెలిసిందే. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 20కోట్ల రూపాయలు శాసన మండలి కోసం ఖర్చు పెడుతున్నట్టు, అలా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్టు చెప్పుకొచ్చారు బాబు. మరి ఇప్పుడు వృథా అయ్యేది ప్రజల సొమ్ము కాదా?  

ఇలాంటి అవమానం ఎదురవుతుందని ముందే గ్రహించి చంద్రబాబు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. ఆఘమేఘాల మీద టీడీఎల్పీ సమావేశం అంటూ కలరింగ్ ఇచ్చి అసెంబ్లీకి రావట్లేదని ప్రకటించుకున్నారు. నాడు-నేడు లాంటి క్యాసెట్ ఏదో వేస్తారనే అనుమానం వచ్చే బాబు సమావేశాలకు మొహం చాటేశారు. కానీ చంద్రబాబు ఈరోజు సభకు వచ్చి ఉన్నట్టయితే ఆ మజానే వేరేగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు జనం. నిండుసభ సాక్షిగా బాబుకు మరోసారి చాకిరేవు పడి ఉండేదని చెప్పుకుంటున్నారు.

మొత్తమ్మీద అసెంబ్లీలో ఈరోజు ప్లే చేసిన చంద్రబాబు వీడియో ఆయన “యూటర్న్ అంకుల్” అనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఇలాంటి మాటలు చెప్పే చంద్రబాబుని ఎలా నమ్మాలంటూ మంత్రి పేర్ని నాని సభలో ప్రశ్నించారు. ఈ వీడియో టీడీపీ నేతల కళ్లు కూడా తెరిపించి ఉంటుందని ముక్తాయించారు.

ప్రజలు చీకొట్టిన వాళ్ళ ఆమోదం అవసరమా

డబ్బులతో రాజకీయాలు చేసేవాళ్లం కాదు