ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడి కుటుంబాలకు మధ్య సుదీర్ఘ కాలంగా రాజకీయ వైరం వుంది. అయితే కిరణ్ తమ్ముడు కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరికతో ఆ వైరం గురించి తక్కవ చర్చ జరుగుతూ వుంటుంది. కానీ కిరణ్, చంద్రబాబు మధ్య మాత్రం వ్యక్తిగతంగా కూడా సరైన సంబంధాలు లేవు. బాబుకు వ్యతిరేకంగా కిరణ్ దీటైన రాజకీయాలు చేశారు. దివంగత వైఎస్సార్ ప్రోత్సాహంతో బాబును కిరణ్ రాజకీయంగా ఓ ఆట ఆడుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి రికార్డుకెక్కారు. ఆంధ్రప్రదేశ్ విభజనను చివరి వరకూ ఆడ్డుకునేందుకు యత్నించిన ముఖ్యమంత్రిగా పేరు పొందారు. ఏపీ విభజన తర్వాత సొంత రాజకీయ కుంపటి పెట్టుకున్నప్పటికీ జనం ఆదరించలేదు. దీంతో ఆయన చాలా కాలం మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అయినప్పటికీ కాంగ్రెస్‌లో యాక్టీవ్‌గా లేరు.
దేశంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారిన, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరడానికి కిరణ్ మొగ్గు చూపారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కిరణ్ కాషాయం కండువా కప్పుకోనున్నారు. బీజేపీలో టీడీపీ, వైసీపీ అనుకూల, వ్యతిరేక నాయకులున్న సంగతి తెలిసిందే. జగన్‌పై కిరణ్ వ్యతిరేకతను కాసేప పక్కన పెడితే, చంద్రబాబు అంటే ఆయనకు ఏ మాత్రం గిట్టదనే సంగతి తెలిసిందే.
దీంతో టీడీపీకి వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశాలున్నాయి. ఇప్పటికే కిరణ్‌తో ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారు. రానున్న రోజుల్లో కిరణ్ క్రియాశీలక పాత్ర పోషిస్తారనే ఉద్దేశంతో ఆయనతో మంచిగా మెలిగేందుకు కొందరు నేతలు ఉత్సాహం చూపుతున్నారు. మరోవైపు టీడీపీ అనుకూల బీజేపీ నేతలు మాత్రం కిరణ్ రాకపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. బీజేపీలో కిరణ్ చేరికతో ఏపీలో కొంత వరకైనా ఆ పూర్తి పుంజుకుంటుందేమో చూడాలి.