హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తడబడకుండా సరిగ్గా రెండు మాటలు కూడా మాట్లాడలేరు. ఎవరి మెప్పుకోసమో అన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తుంటారాయన. యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన నారా లోకేశ్ ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో నడక సాగిస్తున్నారు. ఇవాళ్టికి ఆయన పాదయాత్ర 63వ రోజుకు చేరింది.
శింగనమల నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ దగ్గరికి పిల్లనిచ్చిన మేనమామ నందమూరి బాలకృష్ణ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో తనదైన రీతిలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం గమనార్హం. క్షణికావేశంలో జగన్‌కు ఓటు వేయద్దని కోరారు.
సంక్షేమ పథకాల వల్ల ఏ ఒక్కరికీ ప్రయోజనం లేదన్నారు. మీరూ, నేనూ…ఇలా ఎవరూ బాగుపడలేదన్నారు. కానీ ప్రతి ఒక్కరూ అప్పులపాలయ్యామన్నారు. మరోవైపు నవరత్నాల సంక్షేమ పథకాలు అందుతున్నాయనే భావనతో వైసీపీకి ఓటు వేయవద్దని చెప్పడం ఆయనకే చెల్లింది.
సంక్షేమ పథకాల అమలుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకలా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకున్న చందంగా, ఏపీలో కూడా సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాళా తీస్తుందన్నారు. ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వాడుకోవాలని కోరారు. కులమనో, మరొక కారణమో చూపి వైసీపీకి అండగా నిలబడకూడదని ఆయన కోరారు. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడేవాళ్లన్నారు.
కానీ ఇప్పుడు లోకేశ్ పాదయాత్రకు మద్దతుగా జనం తండోపతండాలుగా రోడ్డు మీదకి వస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. జగన్‌పై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి వుందని అన్నారు. చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి సేవ చేసేందుకు వస్తామని వారే అడుగుతున్నారన్నారు. బాలకృష్ణ మాటలను విన్న మీడియా ప్రతినిధులు, జనం… సరిపోయింది, అల్లుడికి తగ్గ మామే దొరికాడంటూ సెటైర్స్ విసురుతున్నారు.