కన్నడ స్టార్ సుదీప్ కు వచ్చిన బెదిరింపు లేఖ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లేఖ బెదిరింపుల వల్లే అతడు బీజేపీలో చేరకుండా వెనక్కు తగ్గాడని, కేవలం మద్దతు మాత్రమే ఇచ్చి తప్పుకున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై కర్నాటక ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుదీప్, బొమ్మై చాలా క్లోజ్. బొమ్మైకి బహిరంగంగా మద్దతు తెలిపాడు సుదీప్. ఈ క్రమంలో లేఖను సీరియస్ గా తీసుకున్నారు ముఖ్యమంత్రి. వెంటనే విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు, సుదీప్ కారు డ్రైవర్ ను అనుమానిస్తున్నారు.
కొన్నాళ్ల కిందట తన కారు డ్రైవర్ ను పనిలోంచి తొలిగించాడు సుదీప్. అతడే సుదీప్ పై కక్షకట్టి ఈ బెదిరింపు లేఖకు పాల్పడి ఉంటాడనేది ఓ వాదన. దీనికి బలం చేకూరుస్తూ, ఆ కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు, అతడి ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది.
సుదీప్ కారు డ్రైవర్ ను పట్టుకుంటే, లేఖకు సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయని భావిస్తున్నారు పోలీసులు. కేవలం వ్యక్తిగత కక్షతోనే అతడు ఈ పనికి పాల్పడ్డాడా లేక ప్రతిపక్షాలు అతడితో ఈ పని చేయించాయా అనే విషయం తేలుతుంది.
ఈ అంశాల కంటే ముందు అసలు సుదీప్ ప్రైవేట్ వీడియో నిజంగానే అతడి దగ్గర ఉందా అనే విషయాన్ని పోలీసులు నిర్థారించుకోవాల్సి ఉంది. తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియో అతడి దగ్గర ఉండొచ్చని ఈ సందర్భంగా సుదీప్ అనుమానం వ్యక్తం చేయడం విశేషం.