జగన్‌ భవిష్యత్…క‌దులుతున్న సైన్యం!

‘జగనన్నే మా భవిష్యత్‌’ అనే పేరుతో వైసీపీ నూత‌న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ సంద‌ర్భంగా సచివాలయానికి ముగ్గురు చొప్పున  కన్వీన‌ర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు గృహ సారథులతో కూడిన ఏడు…

‘జగనన్నే మా భవిష్యత్‌’ అనే పేరుతో వైసీపీ నూత‌న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ సంద‌ర్భంగా సచివాలయానికి ముగ్గురు చొప్పున  కన్వీన‌ర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌నుంది. ఈ కార్య‌క్ర‌మం 20వ తేదీ వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. మొత్తం 14 రోజులపాటు  15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాల్లోని ఐదు కోట్ల మంది ప్రజలకు చేరువ కావ‌డ‌మే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అద్భుతంగా తీర్చిదిద్దారు.

అయితే ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న ఎలా వుంటుంద‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ‘జగనన్నే మా భవిష్యత్‌’ అని ప్ర‌జ‌లు భావించేలా చేయ‌డమే కార్య‌క్ర‌మం ముఖ్య ల‌క్ష్యం. కానీ ఇది జ‌గ‌న్ భ‌విష్య‌త్‌కు అత్యంత కీల‌క‌మైన కార్య‌క్ర‌మం. ఇప్ప‌టికే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ద్వారా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌ను ప్ర‌తి ఇంటికి వెళ్లేలా జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇది కొంత వ‌ర‌కూ స‌త్ఫ‌లితాలు ఇచ్చింది.

గ‌త నాలుగేళ్ల‌లో వైసీపీ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల ద్వారా పేద‌ల ఖాతాల్లో జ‌మ చేసిన మొత్తం సొమ్ము… అక్ష‌రాలా రూ.2 ల‌క్ష‌ల కోట్లు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం ఇంత భారీగా సంక్షేమ ప‌థ‌కాల‌కు అమ‌లు చేసిన దాఖ‌లాలు లేవు. అధికార ప‌క్షం వైసీపీ ప్ర‌ధానంగా త‌న ఓటు బ్యాంక్ సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులే అని న‌మ్ముతోంది. ఇటీవ‌ల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి సంద‌ర్భాల్లో ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా చెప్పిన సంగ‌తి తెలిసిందే.

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో పాటు వివిధ స్థాయిల్లో ప‌ద‌వుల పంప‌కాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు వైసీపీ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇచ్చింది. నామినేటెడ్ ప‌ద‌వుల్లో  50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు, మహిళలకు రిజర్వ్‌ చేస్తూ చట్టం కూడా తీసుకొచ్చిన ఘ‌న‌త జ‌గ‌న్ స‌ర్కార్‌కే ద‌క్కుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల ఎంపిక‌లో రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి, అర్హ‌తే ప్రామాణికంగా తీసుకోవ‌డం త‌దిత‌ర అంశాలు జ‌గ‌న్ పాల‌న‌కు నిద‌ర్శ‌నంగా నిలిచాయి.

ఇదే సంద‌ర్భంలో సంక్షేమం త‌ప్ప‌, అభివృద్ధి, ప‌రిశ్ర‌మ‌లు, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు లేవ‌నే విమ‌ర్శ కూడా బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌నన్నే మీ భ‌విష్య‌త్ అనే ప్ర‌చారం ఎంత వ‌ర‌కూ రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతుందో చూడాలి. పెద్ద ఎత్తున సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్న జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎం కావాల‌ని ప్ర‌జ‌లు భావిస్తే మాత్రం… వైసీపీ అధికారానికి తిరుగు వుండ‌దు. అందుకే ఈ కార్య‌క్ర‌మం జ‌గ‌న్ భ‌విష్య‌త్‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని చెప్ప‌డం.