అచ్చెన్న బుర్ర త‌క్కువ‌ ప్ర‌శ్న‌లు…అదొక్క‌టే విలువైంది!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తుమ్మినా, ద‌గ్గినా, మాట్లాడినా, మాట్లాడ‌కపోయినా, న‌డిచినా, న‌డ‌వ‌క‌పోయినా… ప్ర‌తిదీ రాజ‌కీయ‌మే. ఏదో ఒక‌టి సాకుగా తీసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు అల‌వాటైంది. ఒంటిమిట్ట రాములోరి క‌ల్యాణోత్స‌వానికి సీఎం జ‌గ‌న్ వెళ్ల‌క‌పోవ‌డంపై…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తుమ్మినా, ద‌గ్గినా, మాట్లాడినా, మాట్లాడ‌కపోయినా, న‌డిచినా, న‌డ‌వ‌క‌పోయినా… ప్ర‌తిదీ రాజ‌కీయ‌మే. ఏదో ఒక‌టి సాకుగా తీసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు అల‌వాటైంది. ఒంటిమిట్ట రాములోరి క‌ల్యాణోత్స‌వానికి సీఎం జ‌గ‌న్ వెళ్ల‌క‌పోవ‌డంపై టీడీపీ విమ‌ర్శ‌ల‌కు దిగింది. కాలు నొప్పితో చివ‌రి నిమిషంలో సీఎం ఒంటిమిట్ట కార్య‌క్ర‌మం ర‌ద్దైన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సాకుగా తీసుకుని జ‌గ‌న్ హిందూ మ‌త వ్య‌తిరేకిగా చిత్రీక‌రించేందుకు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం.

అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించిన వాటిలో ఒకే ఒక్క‌టి విలువైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో అసెంబ్లీలో అచ్చెన్నాయుడిని ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే… బాడీ పెర‌గ‌డం కాదు, కాస్త బుర్ర పెంచుకో అని గ‌ట్టిగా చుర‌క‌లు అంటించారు. అలాంటి బుర్ర త‌క్కువ నాయ‌కుడి నుంచి విలువైన పాయింట్ ఒక‌టి రావ‌డం విశేషమ‌ని జ‌నాలు అంటున్నారు.

“రాముల వారి క‌ల్యాణానికి సీఎం దంప‌తులు వెళ్లి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీ. కాలు బెణికింద‌నే సాకుతో ఒంటిమిట్ట‌కు వెళ్ల‌లేదు. సీఎం వేరే మ‌తాన్ని ఆచ‌రించొచ్చు. సీఎం హోదాలో ఒంటిమిట్ట‌కు వెళ్లాలి క‌దా? పెళ్లిళ్లు, పేరంటాల‌కు భార్య‌తో క‌లిసి జ‌గ‌న్‌ వెళ్తారు. మ‌రి హిందూ దైవ కార్య‌క్ర‌మాల‌కు ఎందుకు దూరంగా వుంటున్నారు?” …ఇలా సాగింది అచ్చెన్నాయుడి ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌.

తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు కూడా సీఎం జ‌గ‌న్ ఒక్క‌రే రావ‌డంపై విమ‌ర్శ‌లున్నాయి. క్రిస్టియ‌న్ మ‌త సంప్ర‌దాయాల‌ను పాటిం చ‌డంవ‌ల్లే తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి, అలాగే ఒంటిమిట్ట రాములోరి ఉత్స‌వాల్లో భ‌ర్త‌తో క‌లిసి పాల్గొన‌ర‌నే విమ‌ర్శ‌ల‌కు బ‌లం క‌లిగించేలా వారి వ్య‌వ‌హార శైలి వుంది. జ‌గ‌న్ దంప‌తుల మ‌న‌సుల్లో హిందూ వ్య‌తిరేక భావ‌న‌లుంటాయంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఎందుకంటే సంక్రాంతి, ఉగాది త‌దిత‌ర వేడుక‌ల‌ను తాడేప‌ల్లిలో సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా నిర్వ‌హిస్తుంటారు.

అయితే ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా విమ‌ర్శిస్తుండ‌డం వ‌ల్ల ఎవ‌రైనా వాటిని న‌మ్మే ప్ర‌మాదం లేక‌పోలేదు. అచ్చెన్నాయుడు లేవ‌నెత్తిన పాయింట్‌లో లాజిక్ వుంది. పెళ్లిళ్లు, పేరంటాల‌కు భార‌తితో క‌లిసి వెళుతున్న‌ట్టే, తిరుమ‌ల‌, ఒంటిమిట్ట ఆల‌యాల్లో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల‌కు కూడా వెళ్లి… దేవ‌త‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తే న‌ష్ట‌మేంట‌నే కోణంలో సీఎం ఆలోచించాల్సిన అవ‌స‌రం వుంది.