తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మోస్ట్ పాపులర్ సీఎం కాదు. అదేంటీ ? కేసీఆర్ అంటే ఎవరో, ఆయన సత్తా ఏమిటో, ఆయన సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంత విలువైన సేవలు చేస్తున్నాడో దేశమంతా తెలుసు. సీఎం కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం అని మంత్రులు రోజూ అదే పనిగా చెబుతుంటారు. రైతుబంధులాంటి పథకం దేశం మొత్తం మీద ఎక్కడైనా ఉందా చూపించండి అని సవాలు చేస్తుంటారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ కొట్టుకుంటున్నా కేంద్ర మంత్రులు అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి తెలంగాణా పథకాలు భేష్ అని మెచ్చుకొని వెళుతుంటారు. అప్పుడప్పుడూ అవార్డులు కూడా ఇస్తుంటారు. ఇక ఎన్నికలపరంగా చూస్తే ఓ రెండు ఉపఎన్నికల్లో తప్ప ఇతర అన్ని రకాల ఎన్నికల్లోనూ టీఆరెస్ దే విజయం.
రాష్ట్రంలో కరెంటుకు ఇబ్బంది లేదు. సాగు నీటికి, తాగు నీటికి ఇబ్బంది లేదు, పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. మరి అంతా మంచిగానే ఉంది కదా. కానీ మోస్ట్ పాపులర్ సీఎంల లిస్టులో కేసీఆర్ పేరు ఎందుకు లేదు. టాప్ లో లేకపోతే పోయింది. ఏదో ఒక స్థానంలో ఉండాలి కదా. ఆర్ధికంగా దివాళా తీసిందని పేరుబడిన, రాజధాని లేదని, అభివృద్ధి లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో చోటు దక్కింది. ఇంతకూ ఈ మోస్ట్ పాపులర్ సీఎంల జాబితా ఏమిటి ? ఎవరు తయారు చేశారు ? తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట నిర్వహించిన మోస్ట్ పాపులర్ సీఎం కేటగిరీ సర్వేలో కేసీఆర్ పేరు టాప్‌లో లేదు.
జనాలని ఆకర్షించడానికి కేసీఆర్ ఎప్పుడూ ఏదో ఒక ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ మధ్య థర్డ్ ఫ్రంట్ అంటూ నేషనల్ పాలిటిక్స్‌లో హడావిడి చేస్తున్నారు. అయితే ఇవేమీ వర్కౌట్ అయ్యేలా లేవు. అసలు జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ పరిస్థితి దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన కలిసిన జాతీయ నేతలంతా హ్యాండ్ ఇచ్చేశారు. అందుకే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట నిర్వహించిన మోస్ట్ పాపులర్ సీఎం కేసీఆర్ పేరు లేదు. దేశం మొత్తంలో మోస్ట్ పాపులర్ సీఎం ఎవరంటూ నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
తర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింజ్ కేజ్రీవాల్, ఆ తర్వాత స్థానాల్లో మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ ధాకరే, జగన్ ఉన్నారు. ఇక సొంత రాష్ట్రాల్లో జరిగిన సర్వేల్లో కూడా కేసీఆర్ అడ్రెస్ లేదు. ఇది మోస్ట్ పాపులస్ కేటగిరీ…ఇందులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉండగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండోస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్టాలిన్, ఉద్దవ్ ధాకరే, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, హిమంత భిశ్వ శర్మ, భూపేష్ బాఘెల్, అశోక్ గెహ్లాట్‌లు ఉన్నారు.
ఈ కేటగిరీలో జగన్ గాని, కేసీఆర్ గాని చోటు దక్కించుకోలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ అటు తెలంగాణ కాకుండా జాతీయ స్థాయిలో నిర్వహించిన పోల్ విషయంలోనూ వెనుకబడి ఉన్నారు. జాతీయ రాజకీయాలలో హడావిడి చేస్తున్న కేసీఆర్.. కనీసం సీఎంగా జాతీయస్థాయిలో గుర్తింపు కూడా తెచ్చుకోలేదు…అలాగే రాష్ట్ర స్థాయిలోనూ వెనుకబడ్డారు. ఏమిటి ….కేసీఆర్ పరిస్థితి ఇలా అయింది ?