చింతామణి. ఈ పేరు వింటేనే అదొక రకం శృంగార భావన కలుగుతుంది. అది పేరు తప్పు కాదు, ఆ పేరుతో ప్రాచుర్యం పొందిన తెలుగు నాటకం వల్లనే ఇలాంటి ఫీల్ వస్తుందేమో. అది ఎవరి తప్పు కాదు, ఆ నాటకాన చింతామణి పాత్ర స్వరూప స్వభావాలూ అలా తీర్చిదిద్దారు.నిజానికి ఈ నాటకం ఇప్పటికి వందేళ్ల క్రితం నాటిది.
దీనికి మహాకవి బిరుదాంకితుడు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన ప్రఖ్యాత సాహితీవేత్త కాళ్ళకూరి నారాయణరావు 1921లో రచించారు. అంటే నేటికి వందేళ్ళు పై దాటింది అన్న మాట. ఆనాటి సామాజిక పరిస్థితులు, అప్పట్లో ఉన్న వ్యసనాలు, చెడు అలవాట్ల నుంచి యువతను చైతన్యం చేయడం కోసం అద్భుతమైన నాటక ప్రక్రియను ఆలంబనగా చేసుకుని కాళ్ళకూరి వారు దీనిని రచించారు.
ఇక ఈ నాటకానికి ఉన్నపేరు ప్రఖ్యాతులు ఎన్నతగినవి. దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా ప్రదర్శనలతో నేటికీ ఎవరూ కొట్టలేని ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. అలాంటి నాటకంలో కొన్ని పాత్రల మధ్య అసభ్య సంభాషణలు జొప్పించి తమకు అనువుగా కొందరు తరువాత కాలంలో మార్చేసుకున్నారు.
ఇక ఒక సామాజికవర్గాన్ని ఇది గుచ్చే విధంగా ఉందని అభిప్రాయంతో గత కొన్నేళ్ళుగా నాటకం రద్దు చేయాలని వారు ఆందోళనలు చేయడంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించింది. అయితే ఈ అద్భుతమైన తెలుగు నాటకాన్ని ఎలా నిషేధిస్తారు అంటూ సాహితీవేత్తలు, కళాభిమానులు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు.
ఇది నాటకం, దాన్ని కళగానే చూడాలి తప్ప మరో విధంగా ఎందుకు ఆలోచించాలి అని కూడా ప్రశ్నిస్తున్నారు. మహాకవి కాళ్లకూరి రాసిన ఈ కళాఖండాన్ని నాటకంగా మరిన్ని శతాబ్దాలు కొనసాగేలా చూడాలని విశాఖలోని తెలుగు దండు పేరిట విశాఖ సాహితీ కారులు కోరుతున్నారు.
ఈ నాటకం మీద ఉన్న నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ఈ నెల 23న విశాఖలో భారీ నిరసన ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణ చేపట్టి కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఏపీ ప్రభుత్వానికి పంపుతామని ప్రతినిధులు తెలియచేస్తున్నారు.
మొత్తానికి చింతామణి నాటకానికి తెర పడలేదు, అసలు అంకం ఇపుడే మొదలైంది అని సాహితీ అభిమానులు చెబుతున్నారు. మరి ఈ నిరసన తరువాత ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. మరో వైపు రాష్త్ర ప్రభుత్వం పునరాలోచించాలన్న డిమాండ్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది మరి.