పీఆర్సీ, హెచ్ఆర్ఏ, ఇతరత్రా సమస్యలపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సందర్భంలో ఉద్యోగులపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఉద్యోగులపై సహజంగా ఉన్న వ్యతిరేకతే ఇందుకు కారణమైంది. బాధ్యతల నిర్వహణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తూ, హక్కుల విషయానికి వస్తే మాత్రం అంతా సక్రమంగా జరగాలనే ఉద్యోగుల డిమాండ్లను నెటిజన్లు గొంతెమ్మ కోర్కెలుగా అభివర్ణిస్తున్నారు.
ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ ఉద్యోగుల జీతాలున్నాయని, ఇలా ఇంకా ఇంకా పెంచుతూ పోతే అంతు ఎక్కడనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు కోవిడ్ మహమ్మారి పంజా విసరడం వల్ల ప్రైవేట్ రంగంలో చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన వాళ్లు కూడా కాయకష్టం చేస్తూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారని, కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగికీ ఒక్క రూపాయి కూడా జీతం తగ్గలేదని దెప్పి పొడుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పని తగ్గిందేమో కానీ, జీతభత్యాలు అలాగే ఉన్నాయని, ఇప్పుడు కాస్త పెరిగాయని, ఈ జీతం చాలదని, ఇంకా పెరగాలని కోరుకుంటున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది ఉపాధ్యాయులు అసలు బడికే వెళ్లరని, వెళ్లినా పాఠాలు చెప్పరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో అసలు బడికే వెళ్లకుండానే… ఇంటి పట్టునే ఉంటూ ఉద్ధరగా జీతాలు పొందిన ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు సీఎం జగన్‌కు శాపనార్థాలు పెట్టే స్థాయికి దిగజారారని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బడి తెరవరు, తెరిచినా ఉపాధ్యాయులు సమయానికి రారు, ప్రభుత్వ ఆఫీసులకు అధికారులు వచ్చేదెప్పుడో వారికే తెలియదు, కానీ అందరికీ జీతాలు మాత్రం పెంచుతూ పోవాలి…ఇదేం నీతి, ఇదేం రీతి అని నెటిజన్లు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల కమ్యూనిటీలో లక్షలాది మంది ఉన్నారని, తాము ప్రభావశీల ఓటర్లమని ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉద్యోగులు తమ ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటున్నారనే విమర్శ నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది.
వీళ్ల అహంకారాన్ని అణచాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యమనే వాదన కూడా బలంగా లేకపోలేదు. ఇదంతా ఉద్యోగులపై సమాజంలో గౌరవం లేని తనాన్ని చూపుతోంది. కావున ఉద్యోగులు కూడా జీతాల కంటే తమపై ప్రజల్లో నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుకునేలా బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఉద్యోగుల బాధ్యత కూడా. కేవలం జీతం పెంచుకోవడంపైన్నే దృష్టి పెడితే… అంతకంటే దిగజారుడుతనం మరొకటి ఉండదు.