తిరుపతిపై బీజేపీది అత్యాశా..? అతి ఆవేశమా..?

దుబ్బాక విజయాన్ని బలుపు అనుకుంటున్నారో.. వాపు అనుకుంటున్నారో తెలియదు కానీ.. బీజేపీ నేతలు మాత్రం అతిగా ఆవేశ పడుతున్నారు, అత్యాశకు పోతున్నారు. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిలో సమావేశం పెట్టి…

దుబ్బాక విజయాన్ని బలుపు అనుకుంటున్నారో.. వాపు అనుకుంటున్నారో తెలియదు కానీ.. బీజేపీ నేతలు మాత్రం అతిగా ఆవేశ పడుతున్నారు, అత్యాశకు పోతున్నారు. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిలో సమావేశం పెట్టి బై పోల్ లో గెలుపు మాదేనని తొడగొట్టారు. 

ఆ తర్వాత ఏకంగా కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో తిరుపతి ఎన్నికలకు బీజేపీ శ్రేణుల్ని సర్వసన్నద్ధం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు.

మొత్తమ్మీద కమలదళం అంతా తిరుపతిలో మకాం పెడుతోంది. బై ఎలక్షన్లకు ఇంకా డేట్ రాక ముందే బీజేపీ హడావిడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అటు జనసేన సీటు అడుగుతుందనే అనుమానం ఉందేమో.. ముందుగానే బీజేపీ తమ పార్టీ అభ్యర్థే బరిలో దిగుతారంటూ సిగ్నల్స్ పంపిస్తోంది.

తిరుపతిలో ఉపఎన్నికలు జరిగితే గెలుపు తమదేనంటూ బీరాలు పలుకుతున్న బీజేపీ.. రెండు తెలుగు రాష్ట్రాల కీలక నేతలందర్నీ అక్కడికే పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. 

ఎన్నికల సమయానికి బీజేపీ కేంద్ర మంత్రులు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. దుబ్బాకలో సింపతీ ఓట్లు వర్కవుట్ కాలేదు కాబట్టి, తిరుపతిలో కూడా వైసీపీకి సింపతీ పనిచేయదనేది బీజేపీ ఆలోచన.

అందుకే మిగతావారి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించేసి ప్రచారం కూడా మొదలు పెట్టాలనేది ఆ పార్టీ ఆలోచన. తెలంగాణలో అయినా బీజేపీకి కనీసం ఓట్లు, సీట్లు ఉన్నాయి. 

ఏపీలో చంద్రబాబు చేసిన మోసానికి ఆ పార్టీకి అన్నీ గుండు సున్నాలే మిగిలాయి. దీంతో ఎలాగైనా తిరుపతి అసెంబ్లీ సీటు దక్కించుకుని, అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఆ పార్టీ నేతలు.

అయితే 2019 ఎన్నికల్లో తిరుపతి సీటు విషయంలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని చతికిలపడ్డ బీజేపీ.. ఏడాదిన్నరలోనే గెలిచేంత పుంజుకుంటుందా అనేది అనుమానించదగ్గ విషయం. టీడీపీ, బీజేపీ, జనసేన.. మూడూ కలసి పోటీ చేసిన 2014లోనే తిరుపతి లోక్ సభ సీటు వైసీపీ ఖాతాలో పడింది. ఇప్పుడిక విడివిడిగా వీళ్లు సాధించేదేంటన్నది సందేహం.

ఒకవేళ టీడీపీ లోపాయికారీగా బీజేపీ-జనసేన కూటమికి మద్దతు తెలిపినా కూడా అక్కడ వాళ్లకు ఒరిగేదేం లేదు. ఎందుకంటే.. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లోకి వచ్చే అన్ని నియోజకవర్గాలు వైసీపీ చేతిలోనే ఉన్నాయి. 

ఎలా చూసుకున్నా తిరుపతి తిరిగి వైసీపీ ఖాతాలోనే పడుతుందనేది స్థానికుల అభిప్రాయం. దీనికితోడు జగన్ పాలన, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఉండనే ఉన్నాయి. కాబట్టి బీజేపీ చేస్తోంది కేవలం ఓవరాక్షన్ మాత్రమే. దుబ్బాక టైపులో తిరుపతిలో వ్యూహాలు, తెరవెనక రాజకీయాలు పనిచేయవు.

ఇది ప్రజాస్వామ్య బలమా.. లోపమా?