ఏ పండగ జరిగినా.. అమరావతి వాసులు టెంట్లలోనే ఉంటూ ఆ పండగ జరుపుకున్నట్టు.. అసలు పండగలకే దూరమైపోయినట్టు, దానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనన్నట్టు పచ్చపాత మీడియా కథనాలు వండివారుస్తుంటుంది. అయితే ఇటీవల కాలంలో ఈ రాతలు, కోతలు అన్నీ చప్పబడ్డాయి.
చంద్రబాబు కూడా అమరావతిని పూర్తిగా అటకెక్కించేశారు. టిడ్కో ఇళ్ల వ్యవహారం, లేదంటే.. ఎప్పటికప్పుడు కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయం.. ఇవే ఇప్పుడు చంద్రబాబు ముందున్న అసలు టాస్క్ లు.
అమరావతి ఆందోళనల్లో పాల్గొనేవారి సంఖ్య కూడా రోజురోజుకీ పూర్తిగా తగ్గిపోతోంది. అమరావతికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంతంలోనే బడుగు బలహీన వర్గాల ఉద్యమం మరోటి మొదలయ్యే సరికి రాజకీయ పార్టీలు కూడా ఆ వ్యవహారానికి దూరంగా జరిగాయి. ప్రస్తుతం అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనలు ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు సాగిపోతున్నాయి.
గతంలో ఉన్న జోరే చంద్రబాబులో ఉంటే.. కచ్చితంగా టెంట్లలోనే దీపావళి అంటూ రెచ్చిపోయేవారు. మనవడితో కలసి చిచ్చుబుడ్లు, భూ చక్రాలు, తారా జువ్వలు.. అన్నీ అమరావతి ఉద్యమ ప్రాంతం నుంచే కానిచ్చేవారు. కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది.
అమరావతి అందరి ఉద్యమం కాదు, కొందరి ఉద్యమమేనని రాష్ట్రవ్యాప్తంగా తెలిసిరావడం, అమరావతి ఒక్కదానితోనే అంటకాగడం వల్ల మిగతా ప్రాంతాల్లో టీడీపీ ఇమేజీ డ్యామేజీ కావడంతో అసలు రాజధాని సమస్యను బాబు తలచుకొని కూడా చాలా రోజులవుతోంది.
చంద్రబాబే కాదు, అమరావతి పేరుతో గతంలో రెచ్చిపోయిన వామపక్షాలు, జనసేన, బీజేపీ కూడా పూర్తిగా ఆ టాపిక్ నుంచి పక్కకు తప్పుకున్నాయి. దీంతో అమరావతి ఉద్యమం పేరుతో వండి వారుస్తున్న కథలు, కథానికలకు కూడా బ్రేక్ పడింది.
బ్యానర్ ఐటమ్ స్థాయి నుంచి, ఫొటో లేకుండా జిల్లా పేజీలో వేసే వార్త స్థాయికి అమరావతి నిరసనలు చేరుకున్నాయి. ఇక కనువిప్పు కలగాల్సిందల్లా.. ఉద్యమంలో పాల్గొంటున్నవారికే. అభివృద్ధి, ఆస్తులు తమ ఒక్కరి సొత్తు మాత్రమే అనుకోకుండా రాష్ట్రం మొత్తం బాగుపడాలని కోరుకుంటే అదే చాలు.