తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఉప ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతున్నట్టుగా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలో తాము పోటీ చేయకుండా.. బీజేపీకి మద్దతు ప్రకటించి ఆ పార్టీకి చేరువ కావాలనేది చంద్రబాబు నాయుడి వ్యూహంగా కనిపిస్తూ ఉంది.
అవకాశవాదంలో పీహెచ్డీ చేసినట్టుగా వ్యవహరించే చంద్రబాబు నాయుడు బీజేపీకి తిరుపతి బై పోల్ ను బిస్కెట్ గా వేస్తున్నారు. ఈ బిస్కెట్ కు బీజేపీ పడితే చంద్రబాబుకు అంత కన్నా కావాల్సింది లేదు.
తమ మద్దతును బీజేపీ తీసుకుంటే, తిరుపతి సీట్లో తాము పోటీ చేసి నెగ్గినంత ఆనందపడే అవకాశాలున్నాయి. అయితే బీజేపీ మాత్రం చంద్రబాబును ఛీదరించుకుంటూ ఉంది. చంద్రబాబును బీజేపీ నేతలు రకరకాలు విమర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వారు ఆయన ఉచితంగా ప్రకటిస్తున్న, బేషరతుగా ప్రతిపాదిస్తున్న మద్దతును వారు తీసుకుంటారా? అనేది ప్రశ్నార్థకం.
ఒకవేళ బీజేపీ చంద్రబాబు మద్దతును తీసుకుంటే.. మరోసారి ఆ పార్టీ చంద్రబాబు తోకగా ఉండిపోవడానికి రెడీ అయినట్టే. చంద్రబాబు తన పాలనలో చేసిన పాపాలన్నింటిలోనూ బీజేపీ కూడా వాటా తీసుకున్నట్టే. చంద్రబాబు వ్యతిరేకుల ఆగ్రహాన్ని బీజేపీ కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పనితీరు చాలా అద్వాన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మద్దతు ఇచ్చినా బీజేపీకి దక్కేదేమిటనేది ప్రశ్నార్థకం.
తాము గట్టిగా పోటీపడే పరిస్థితి ఉంటే.. అప్పుడు టీడీపీ మద్దతు బీజేపీకి ఉపయోగపడేదేమో కానీ, తిరుపతి నియోజకవర్గానికి ఎల్లలు కూడా బీజేపీ నేతలకు తెలియవు. కాబట్టి.. అలాంటి చోట చంద్రబాబు మద్దతు బీజేపీకి కొత్త భారమే తప్ప ఉపయోగం ఉండకపోవచ్చు.
ఇక సొంతంగా పోటీ చేయడానికి చంద్రబాబుకు ఆసక్తి లేదని స్పష్టం అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగూ టీడీపీ అక్కడ సత్తా చూపించేది ఏమీ లేదు. తిరుపతి ఎంపీ సీటును టీడీపీ నెగ్గక చాలా సంవత్సరాలు గడిచాయి.
టికెట్ ఇవ్వాలన్నా జనాలు ఇప్పటికే అడ్రస్ మరిచిపోయిన నేతలనే తెచ్చి బరిలోకి దింపాల్సిన పరిస్థితి ఉంది. వారికి టికెట్ ఇస్తే వచ్చే ఓట్లు కూడా పోయేలా ఉంది పరిస్థితి. మరి జూమ్ మీటింగులతో రాష్ట్రం మొత్తాన్నీ తనే శాసిస్తున్నట్టుగా ఫీలవుతున్న చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో తన పార్టీ సత్తా ఏ రేంజ్ లో చూపిస్తారో, టీడీపీ ఏ మేరకు పరువు నిలబెట్టుకుంటుందో!