ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించే రోజులు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. లైంగిక దాడులు లాంటివి కలవర పెడుతున్నా …మరోవైపు ఆడ, మగ అనే లింగ వివక్షతో తల్లిదండ్రులు చూడడం క్రమంగా తగ్గుతోంది. మగ పిల్లల మాదిరిగానే ఆడ పిల్లలు కూడా బాగా చదువుకుని, మంచిగా స్థిర పడాలని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. కలలను సాకారం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు.
అందుకే ఆడపిల్లల వివాహ వయస్సు క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఆడపిల్ల పెద్ద మనిషైతే చాలు …ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి అత్తగారింటికి పంపుదామా? అని తల్లిదండ్రులు ఆరాట పడేవారు. ఇప్పుడు మాత్రం ఇంటర్ తర్వాత ఏ కోర్సు చేర్పించాలి? ఆ తర్వాత ఏంటి? ఇలా తమకు తెలిసిన విద్యావంతులతో చర్చించడం చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆడపిల్లల పెళ్లి వయస్సుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఈ అధ్యయన నివేదిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆడపిల్లలు తమ కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ నివేదిక సారాంశం. పెళ్లి కంటే కేరీర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం గమనించాల్సిన విషయం.
దశాబ్ద కాలం క్రితం వరకు మెజార్టీ ఆడపిల్లల సగటు వివాహ వయస్సు 18-20 ఏళ్ల మధ్యలో ఉండేది. ఇప్పుడు ఎక్కువ మంది ఆడపిల్లలు 21 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన 2019-20 గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో 10.2% మంది ఆడపిల్లలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరిగేవి. ఇప్పుడు ఆ వయస్సుపు జరిగే వివాహాలు 1.9% తగ్గాయి.
ఆడపిల్లల ధోరణులతో పాటు మగవాళ్లలో కూడా మార్పు వచ్చింది. నగరీకరణ పెరగడం, ఉపాధి కోసం పట్టణాలకు వలసలు పెరిగాయి. దీంతో కుటుంబం గడవాలంటే కేవలం కుటుంబ యజమాని సంపాదన సరిపోవడం లేదు. దీంతో తనతో పాటు ఉద్యోగం చేసే అమ్మాయి అయితే బాగుంటుందనే ఆలోచన మగవాళ్లలో పెరిగింది.
చదువుతో పాటు ఉద్యోగం చేయడం వల్ల భర్త వద్ద చేయి చాచే దుస్థితి తప్పుతుందనే అత్మాభిమానం ఆడపిల్లల్లో కూడా బాగా పెరిగింది. కుటుంబ పోషణలో తమ భాగస్వామ్యం ఉండాలనే తలంపు ఆడపిల్లల్లో పెరుగుతూ వస్తోంది. దీంతో పెళ్లి కంటే కెరీర్‌పై ఆడపిల్లలు ఎక్కువ దృష్టి పెట్టారు.
2006లో దేశవ్యాప్తంగా వివాహం జరిగే నాటికి యువతుల సగటు వయస్సు 20.5 ఏళ్లు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 19.5 ఏళ్లే ఉండేది. ఇప్పుడు తెలంగాణలో ఆడపిల్లల వివాహ సగటు వయస్సు 22 ఏళ్లకు చేరింది. గ్రామీణ మహిళల సగటు వయస్సు 19.2 నుంచి 21.6 ఏళ్లకు పెరిగింది. ఇదే పట్టణ ప్రాంతాల్లోకి వస్తే అమ్మాయిల వయస్సు 20.6 నుంచి 22.8 ఏళ్లకు చేరింది. మొత్తానికి అమ్మాయిలు చదువు, కొలువులపై మొగ్గు చూపడం శుభ పరిణామం.