రాయలసీమకు చెందిన ప్రముఖ రచయిత బండి నారాయణస్వామి నీళ్లే నాగరికత అంటారు. తన ప్రాంతం నీళ్లకు నోచుకోని తనాన్ని, నీళ్ల ఆవశ్యకతను, పాలకులు, ప్రకృతి కలిసి వెనుకబడిన ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని తన రచనల్లో ఆయన ఆవిష్కరించారు.
తీవ్ర దుర్భిక్షంతో అల్లాడే రాయలసీమ నీళ్ల కోసం ఎంతగా పరితపిస్తుందో తన రచనల్లో ఆయన కళ్లకు కట్టారు. నీళ్లు ఉంటే ఎన్ని అద్భుతాలైనా సృష్టించవచ్చు.
తెలంగాణ సీఎంవో ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ దీపావళిని పురస్కరించుకుని స్వీట్ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీళ్లు ఎంత ప్రాణాధారమో స్మితా ఒకే ఒక్క వాక్యంతో చెప్పగలిగారు. అందుకే ఆమె ట్వీట్ నెటిజన్ల ప్రశంసలు అందుకోడానికి ప్రధాన కారణం.
‘నీళ్లంటే జీవితం.. నీళ్లుంటేనే పండుగ’ అంటూ సీఎంవో ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ స్మితాసబర్వాల్ ఈ ట్వీట్ చేశారు.
ఈ పోస్టుతో పాటు మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె జత చేశారు. ‘నీళ్లంటే జీవితం.. మిషన్ భగీరథ 1.47 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేయడంతో పాటు 55 లక్షల గృహాలకు చేరింది. అందరూ దీపావళిని సంతోషంగా జరుపుకోవాలి’ అని ఆమె తన ఆకాంక్షను ట్వీట్ రూపంలో వెల్లడించారు.
తెలంగాణ సర్కార్ చేపట్టిన బృహత్తర సాగునీటి ప్రాజెక్టులను సమన్వయపరిచే అధికారిగా స్మితా కీలక పాత్ర పోషించారు, ఇంకా పోషిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సాగు, తాగునీళ్లు అందించడంలో పాలకుల పట్టుదలకు స్మితా సబర్వాల్ లాంటి అధికారుల చిత్తశుద్ధి తోడు కావడం కలిసి వచ్చింది.
నీళ్లంటే జీవితం అనే ఒకే ఒక్క మాట చాలు … మనిషి తన్మయం చెందడానికి. స్మితా సబర్వాల్ ట్వీట్ హార్ట్ టచింగ్‌గా ఉండడం వల్లే వైరల్ అవుతోందని ప్రత్యేకంగా చెప్పాలా?