జనసేన అంటే కామెడీ పీస్ అయ్యింది. ఆ పార్టీ నాయకుడు పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో సీరియస్‌గా నటిస్తూ నవ్వు తెప్పిస్తున్నారు. యథా నాయక, తథా కార్యకర్తలు అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి వుంది.
తాజాగా “ఇంటింటికీ రాబోయే మన జనసేన ప్రభుత్వం” పేరుతో ఆ పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ఈ మేరకు కరపత్రాలను నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. అధికారంలోకి రావాలని పవన్‌కల్యాణ్‌కు లేని సంగతి తెలిసిందే. ఎంత సేపూ చంద్రబాబుని సీఎం చేయడమే లక్ష్యంగా పవన్ రాజకీయ పంథా సాగుతోంది. అంతెందుకు, నిన్నటికి నిన్న ఢిల్లీ పర్యటనలో టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ అగ్రనేతల వద్ద ప్రస్తావించినట్టు నాదెండ్ల మనోహర్ చెప్పారు.
టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటే చంద్రబాబు కాకుండా ఇతరులకు సీఎం సీటు ఆఫర్ చేస్తారా? ఈ విషయం పవన్‌కల్యాణ్‌కు,జనసేన నాయకులకు తెలియదా? అయినప్పటికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో విజయవాడలో ఓ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని జనసేన చేపట్ట తలపెట్టింది. జనసేన ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసి… సొంత పార్టీ నేతలే నవ్వుకునే పరిస్థితి. జనసేనను బలోపేతంపై దృష్టి సారించకుండా, పొత్తుల కోసం పవన్ అర్రులు చాచడం విమర్శలకు దారి తీస్తోంది.
ముందు పార్టీని బలోపేతం చేసుకుంటే, అవసరమైన ఇతర పార్టీలు తమ వద్దకే వస్తాయన్న కనీస స్పృహ కూడా పవన్‌లో కొరవడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే రీతిలో పవన్ రాజకీయాలు చేస్తే మాత్రం… చివరికి ఆయన పేరు చెబితే భయపడి దూరంగా పరుగు తీసే పరిస్థితి తెచ్చుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.