‘చంద్ర’ నినాదమే.. భయ సంకేతం!

చంద్రబాబునాయుడు ఇప్పుడు ఒక సరికొత్త నినాదం ఎత్తుకున్నారు. పార్టీని ఎన్నికలకు సిద్ధంగా ఉత్తేజపరిచే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ… మేం ఢంకా బజాయించి గెలవబోతున్నాం అని చెప్పడం చాలా సాధారణమైన విషయం.. అయితే చంద్రబాబు…

చంద్రబాబునాయుడు ఇప్పుడు ఒక సరికొత్త నినాదం ఎత్తుకున్నారు. పార్టీని ఎన్నికలకు సిద్ధంగా ఉత్తేజపరిచే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ… మేం ఢంకా బజాయించి గెలవబోతున్నాం అని చెప్పడం చాలా సాధారణమైన విషయం.. అయితే చంద్రబాబు కాస్త ముందడుగు వేసి.. ‘వైనాట్ పులివెందుల’ అనే నినాదాన్ని తాజాగా అడాప్ట్ చేసుకున్నారు. 

వైఎస్ కుటుంబానికి, ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కంచుకోట వంటి పులివెందుల నియోజకవర్గంలో కూడా మనం గెలవగలం అని మాటలు చెప్పడం ద్వారా పార్టీ శ్రేణులకు స్ఫూర్తి ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్టుగా ఉంది. 

చంద్రబాబునాయుడు రాజకీయ చాణక్యుడు, వ్యూహచతురత నిపుణుడు.. ఇవన్నీ పాచిపోయిన కితాబులు అనుకోవాల్సిందే. ఆయన మార్కు వక్ర రాజకీయాలు కొన్ని దశాబ్దాల కిందట, అప్పటి పరిస్థితులకు కొత్తగా అనిపించాయేమో. ఇప్పుడు రాజకీయాలకు తగినట్టుగా వేగంగా ఆలోచించగల, సొంత ఐడియాలు తీసుకోగల నేర్పు చంద్రబాబునాయుడులో అంతరించిపోయింది. 

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చంద్రబాబునాయుడు కాపీ క్యాట్ అయిపోయారు. జగన్ ‘గృహసారథులు’ అనే పదంతో కార్యకర్తలను ప్రజల్లోకి పంపుతోంటే.. ఆ ఆలోచనను కాపీ కొట్టారు సరే.. ఆ పేరును కూడా చంద్రబాబు కాపీ కొట్టారు. 

తమ పార్టీ తరఫున ఇల్లిల్లూ తిరగాల్సిన వారికి ‘కుటుంబ సాధికార సారథి’ అని కాపీ పేరు పెట్టారు. అలాగే సీఎం జగన్ ‘వైనాట్ 175’ అంటూ మనం చేపడుతున్న అద్భుతమైన అభివృద్ధికి స్పందనగా రాష్ట్రంలో మొత్తం అన్ని స్థానాలను మనం గెలవగలం అని అంటూ ఉండగా ఆ నినాదం బాగా పాపులర్ అయింది. చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గు పడకుండా ఆ నినాదం కూడా కాపీ కొట్టేశారు. కాకపోతే ‘వైనాట్ పులివెందుల’ అని అంటున్నారు. కానీ విషయం ఏంటంటే.. చంద్రబాబునాయుడు ఎంచుకున్న ఆ నినాదమే ఆయనలోని భయానికి నిదర్శనంగా కనిపిస్తోంది. 

వైనాట్ 175 అని జగన్ అనడంలో ఒక ఆశావహ దృక్పథం ఉంది. మన పనులు అన్నిచోట్లా మనను గెలిపిస్తాయి అనే తరహా ఆలోచన ఉంది. కానీ వైనాట్ పులివెందుల- అనడంలోనే.. పులివెందుల అంటే అది తాము జీవితంలో గెలవగలేని సీటు అని, దాన్ని గెలవగలిగితే రాష్ట్రమంతా గెలిచినట్టేననే భయం కనిపిస్తోంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆపరిధిలోని వ్యక్తిని పోటీచేయించి గెలిపించుకున్నంత మాత్రాన, పులివెందులలో గెలవడం అనేది చంద్రబాబునాయుడు తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యమయ్యేది కాదు. కాకపోతే.. పులివెందుల అంటేనే ఆయనలోని భయం నిత్యం అదే నామస్మరణ చేసేలా ప్రేరేపిస్తుంటుందని.. ఈ నినాదం ద్వారా అర్థమవుతోంది.