మొదటిసారి ఓ పాజిటివ్ సంకేతం

ఏ ముహూర్తాన ఆదిపురుష్ సినిమాను మొదలుపెట్టారో కానీ, ప్రశంశల కంటే విమర్శలే ఎక్కువగా చవిచూసింది ఈ ప్రాజెక్టు. ఏ స్టిల్ రిలీజైనా, టీజర్ వచ్చినా పొగడ్తల కంటే తిట్లే ఎక్కువ తిన్నారు యూనిట్ జనాలు.…

ఏ ముహూర్తాన ఆదిపురుష్ సినిమాను మొదలుపెట్టారో కానీ, ప్రశంశల కంటే విమర్శలే ఎక్కువగా చవిచూసింది ఈ ప్రాజెక్టు. ఏ స్టిల్ రిలీజైనా, టీజర్ వచ్చినా పొగడ్తల కంటే తిట్లే ఎక్కువ తిన్నారు యూనిట్ జనాలు. అలాంటి ఆదిపురుష్ యూనిట్ కు తొలిసారి ఓ పాజిటివ్ సంకేతం వచ్చింది. అది ఈరోజు.

హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ నుంచి హనుమంతుడి గెటప్ తో ఉన్న స్టిల్ ను రిలీజ్ చేశారు. దీంతో పాటు జై శ్రీరామ్ నినాదంతో ఉన్న ఓ సాంగ్ బిట్ ను కూడా విడుదల చేశారు. పోస్టర్ తో పాటు, ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.

చాన్నాళ్ల కిందట రిలీజైన ఆదిపురుష్ టీజర్ లోనే చివర్లో ఈ జైశ్రీరామ్ సాంగ్ ను పరిచయం చేశారు. ఈరోజు ఆ పాటకు సంబంధించి నిమిషం నిడివి ఉన్న ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. సాంగ్ బిట్ మరీ ట్రెడిషనల్ గా లేకున్నా, ఉత్సాహం రేకెత్తించేలా ఉంది. సినిమా సెకెండాఫ్ లో ఎక్కువగా ఈ సాంగ్ బిట్ ను వాడినట్టు తెలుస్తోంది.

ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవ్ దత్తా నాగె హనుమంతుడిగా కనిపించనున్నారు.

కొత్త పోస్టర్, సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా మరోసారి విడుదల తేదీపై స్పష్టత ఇచ్చారు. జూన్ 16న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది ఆదిపురుష్ మూవీ. ఈ సినిమాను ఐమ్యాక్స్, త్రీడీ వెర్షన్లలో కూడా తీసుకొస్తున్నారు.