క‌రోనాను లైట్ తీస్కో.. వీకెండ్ లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు!

దేశంలో ఇప్పుడు ఎక్కువ స్థాయిలో కేసులు వ‌స్తున్న రాష్ట్రాల్లో ఒక‌టి క‌ర్ణాట‌క‌. గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల్లో కూడా అక్క‌డ ముప్పై నాలుగు వేల స్థాయిలో కేసులు వ‌చ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా…

దేశంలో ఇప్పుడు ఎక్కువ స్థాయిలో కేసులు వ‌స్తున్న రాష్ట్రాల్లో ఒక‌టి క‌ర్ణాట‌క‌. గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల్లో కూడా అక్క‌డ ముప్పై నాలుగు వేల స్థాయిలో కేసులు వ‌చ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు పైనే ఉంది. 

క‌రోనా కేసుల నియంత్ర‌ణ కోసం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం గ‌త ఏడాది డిసెంబ‌ర్ 28 నుంచినే నైట్ క‌ర్ఫ్యూను ప్ర‌క‌టించింది. ఇక జ‌న‌వ‌రి తొలి వారం నుంచి వీకెండ్ లాక్ డౌన్ ను ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు విశేషం ఏమిటంటే.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఈ వీకెండ్ లాక్ డౌన్ ను ఎత్తేసే ఆలోచ‌న‌లో ఉండ‌టం.

వీకెండ్ లాక్ డౌన్ పై క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. కొంత‌మంది మంత్రులు లాక్ డౌన్ ప‌ట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేశారు. దీంతో ముఖ్య‌మంత్రి ఇప్పుడు లాక్ డౌన్ ను ఎత్తేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఈ వారంతం నుంచి వీకెండ్ లాక్ డౌన్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

వీకెండ్ లాక్ డౌన్ పై వ‌ర్త‌క‌వ్యాపార వ‌ర్గాల నుంచి  తీవ్ర వ్య‌తిరేక‌త వస్తోంది. దీని వ‌ల్ల త‌మ వ్యాపారాలు దెబ్బ‌తింటాయ‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. అలాగే లాక్ డౌన్ల వ‌ల్ల ప్ర‌భుత్వాలూ ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ని వేరే చెప్ప‌నక్క‌ర్లేదు.

మ‌రోవైపు ప్ర‌స్తుతం భారీ గా కేసులు వ‌స్తున్నా.. వీటిల్లో హాస్పిట‌లైజ్ శాతం చాలా త‌క్కువ‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ‌మే చెబుతోంది. ఐదు శాతం కేసులు కూడా హాస్పిట‌ల్స్ వ‌ర‌కూ వెళ్ల‌డం లేద‌ని, చాలా వ‌ర‌కూ క‌రోనా సోకిన వారు హోం ఐసొలేషన్లోనే కోలుకుంటున్నార‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం చెబుతోంది. క‌రోనా ఒక ఫ్లూ జ్వ‌రం త‌ర‌హాగా మారింద‌నే అభిప్రాయాల నేప‌థ్యంలో… కేసుల సంఖ్య‌తో సంబంధం లేకుండా ఆంక్ష‌లను ఎత్తి వేయ‌డానికి ప్ర‌భుత్వాలు రెడీ అవుతున్న‌ట్టుగా ఉన్నాయి.