అన్ని పార్టీల రాష్ట్రంలో… ముఖాముఖి పోరు!

రెండు పెద్ద ప్రాంతీయ పార్టీలు, ఇంకా ప‌లు కుల పార్టీలు, మ‌త పార్టీలు, జాతీయ పార్టీలు, ప‌క్క రాష్ట్రాల‌కు చెందిన చోటామోటా పార్టీలు.. ఇవ‌న్నీ యూపీ ఎన్నిక‌లు వ‌స్తే రంకెలు వేసేవి. ఎవ‌రికి వారు…

రెండు పెద్ద ప్రాంతీయ పార్టీలు, ఇంకా ప‌లు కుల పార్టీలు, మ‌త పార్టీలు, జాతీయ పార్టీలు, ప‌క్క రాష్ట్రాల‌కు చెందిన చోటామోటా పార్టీలు.. ఇవ‌న్నీ యూపీ ఎన్నిక‌లు వ‌స్తే రంకెలు వేసేవి. ఎవ‌రికి వారు త‌మ ఉనికిని చాటుకునేందుకు అమీతుమీ పోటీ ప‌డేవారు!

ఎస్పీ, బీఎస్పీల రూపంలో రెండు మ‌ద‌గ‌జాలు ప్రాంతీయ పార్టీలుగా త‌ల‌ప‌డేవి. వీటికి జాతీయ పార్టీల ట్యాగ్ కూడా ఉన్నా, ప్ర‌ధాన బేస్ మాత్రం యూపీనే. ఇక జాట్ ల పార్టీ ఆర్ఎల్డీ ఒక‌ప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో కూడా త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేసేది. ఇక అప్నాద‌ళ్ తో మొద‌లుకుని కులాల‌కు ప్రాతినిధ్యం వ‌హించే పార్టీలూ, ఇవి చాల‌వ‌న్న‌ట్టుగా బిహార్, మ‌హారాష్ట్ర‌ల్లో రాజ‌కీయాలు చేసే పార్టీలు కూడా యూపీలో తామూ ఉన్నామంటూ పోటీకి దిగేవి. 

ప్ర‌ధాన పార్టీల ఓట్ల‌ను చీల్చ‌డానికి య‌త్నించేవి. ఇక  కొన్నేళ్లుగా ఒవైసీ త‌య‌ర‌య్యాడు యూపీలో. బీజేపీని నిత్యం ద్వేషిస్తున్న‌ట్టుగా మాట్లాడుతూ.. ఓట్ల చీలిక ద్వారా బీజేపీకి వీలైనంత‌గా మేలు చేసే నేత‌గా ఒవైసీ ఎదిగాడు. ఇలా జాతీయ‌, ప్రాంతీయ‌, ఉప‌ప్రాంతీయ, కులాల‌, మ‌త పార్టీల హోరు మ‌ధ్య‌న యూపీ ఎన్నిక‌లు జ‌రిగేవి.

ఈ పోటీలో.. ఓట్ల శాతానికి, అధికారాన్ని అందుకోవ‌డానికి పెద్ద‌గా సంబంధం ఉండేది కాదు! ముప్పై శాతం ఓట్ల‌ను పొంది కూడా రికార్డు స్థాయి మెజారిటీని అందుకునేవి పార్టీలు. అధికారాన్ని ద‌క్కించుకునే వారు పొందే ఓట్ల‌కు రెట్టింపు శాతంలో ఓడిపోయిన పార్టీల‌న్నీ క‌లిపి పొందేవి! విప‌రీత‌మైన ఓట్ల చీలిక‌తో యూపీలో గెలిచిన వారికి ద‌క్కే ఓట్ల శాతం ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే త‌క్కువే! అర‌వై నుంచి డెబ్బై శాతం సీట్ల‌ను పొందిన పార్టీలు కూడా ముప్పై శాతం ఓటు బ్యాంకుకు ప‌రిమితం అయ్యే ప‌రిస్థితుల మ‌ధ్య‌న యూపీ ఎన్నిక‌లు జ‌రిగేవి.

అయితే ఈ సారి మాత్రం దేశంలోనే అత్యంత ఎక్కువ జ‌నాభాను క‌లిగిన రాష్ట్రంలో పోరుముఖాముఖిగా మారింది. మిగిలిన పార్టీలు లేవా? అంటే.. ఉన్నాయి. నామ‌మాత్రంగా మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. బీజేపీ వ‌ర్సెస్ స‌మాజ్ వాదీగా యూపీ ఎన్నిక‌ల ముఖ‌చిత్రం మారింది.

ఎస్పీ చాటున కొన్ని కుల పార్టీలు, బీజేపీ చాటున మ‌రి కొన్ని కుల పార్టీలు ఒదిగాయి. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి కిక్కురుమ‌న‌డం లేదు. ఇప్ప‌టికే బీఎస్పీ నుంచి ముఖ్య నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బీజేపీ, ఎస్పీల వైపు చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి కూడా పేరున్న వాళ్లంతా ఎప్పుడో ఖాళీ చేసేశారు. యూపీలో క్ర‌మంగా కుంచించుకుపోయిన కాంగ్రెస్ గురించి మాట్లాడేవారు కూడా లేర‌క్క‌డ‌. ప్రియాంక అక్క‌డ కాంగ్రెస్ బాధ్య‌త‌లు తీసుకుందంటున్నా.. ఎలాంటి ఊపూ లేదు!

ఇక వంద స్థానాల్లో పోటీ అంటున్న ఒవైసీని యూపీ ముస్లింలు కూడా న‌మ్మే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఒవైసీకి ఓటు వేయ‌డం అంటే.. బీజేపీ విజ‌యానికి ప‌రోక్ష స‌హ‌కారం అందించ‌డ‌మే అనేది వారికి కూడా అర్థం అయ్యింది. మ‌హారాష్ట్ర‌, బిహార్ త‌ర‌హాలో.. యూపీలో ఒవైసీ ఆట‌లు సాగేలా లేవు. 

స్థూలంగా అనేక పార్టీల పోరుగా సాగే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ సారి ముఖాముఖిగా మారాయి. అయితే బీజేపీ, లేక‌పోతే ఎస్పీ అన్న‌ట్టుగా ప్ర‌జ‌ల ఛాయిస్ మారిన తీరు స్పష్టం అవుతోంది.