సాక్షిని బ్యాన్ చేస్తాం.. ఉద్యోగుల హెచ్చరిక

సాక్షి పత్రికను ఎవరు కొన్నా, ఎవరు కొనకపోయినా, ఎవరు కొని చదివినా, ఎవరు పక్కింటోడి పేపర్ తీసుకుని చదివినా యాజమాన్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు పత్రిక మనుగడకు వచ్చిన…

సాక్షి పత్రికను ఎవరు కొన్నా, ఎవరు కొనకపోయినా, ఎవరు కొని చదివినా, ఎవరు పక్కింటోడి పేపర్ తీసుకుని చదివినా యాజమాన్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు పత్రిక మనుగడకు వచ్చిన కష్టమేమీ లేదు. కానీ ఏపీలోని అధికారిక కార్యాలయాలకు అధికారిక పత్రికగా వస్తున్న సాక్షిని బ్యాన్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. అదే జరిగితే అది అవమానం తప్ప ఇంకోటి కాదు.

ఉద్యోగుల పీఆర్సీ గొడవ ఓవైపు జరుగుతుండగా.. సాక్షిలో ఉద్యోగులను కించపరిచే కథనాలు వస్తున్నాయి. వారి డిమాండ్లను, నిరసనలను ప్రస్తావించకపోగా.. జీతాలు తగ్గలేదని, ఏపీలోనే ఎక్కువ జీతాలొస్తున్నాయనే రివర్స్ కథనాలొస్తున్నాయి. తమపై వ్యతిరేక వార్తలు రాసే ఇలాంటి పేపర్ ని తమ జేబులోనుంచి డబ్బులు పెట్టి కొనడం, పెంచి పోషించడం ఉద్యోగులకు ఇష్టం లేదు. దీంతో వాళ్లంతా సాక్షి పేపర్ ని ఆఫీస్ లకు వేయకుండా ఆపేయాలని అనుకుంటున్నారట. అయితే ఉద్యోగులు అంత ధైర్యం చేస్తారా, దాన్ని కూడా తెగేదాకా లాక్కుంటారా వేచి చూడాలి. 

ఇప్పటి వరకూ జీవో కాపీలే తగలబెట్టారు, సాక్షి కాపీలు తగలబెట్టడం మొదలు పెట్టారంటే అది ప్రభుత్వానికి, సాక్షి యాజమాన్యానికి కూడా పరువు తక్కువ. పచ్చ మీడియాకి మరింత బలం.

ఎందుకంత వ్యతిరేకత..

వాస్తవానికి సీఎం జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ సాక్షి సమర్థించొచ్చు. అదే సమయంలో ప్రజల్లో ఉన్న ఆందోళనను, అసహనాన్ని కూడా అధినేత దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా సాక్షిదే. గతంలో చంద్రబాబు ప్రమాదపుటంచుల్లో ఉన్నా కూడా అంతా బాగానే ఉంది అంటూ కలరింగ్ ఇచ్చి ఎన్నికల్లో నిట్టనిలువునా బాబుని పాతేశాయి పచ్చ పత్రికలు. ఒకరకంగా ఆ పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారానే బాబు తన గెలుపుని అతిగా ఊహించుకున్నారు. చివరకు బొక్కబోర్లా పడ్డారు.

అదే చంద్రబాబు అప్పట్లో సాక్షి పేపర్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే.. జనం ఏమనుకుంటున్నారో తెలిసేది. కానీ అది అసాధ్యం. ఇప్పుడు సాక్షి కూడా జగన్ తీసుకునే నిర్ణయాలను సమర్థిస్తోందే కానీ, జనం ఏమనుకుంటున్నారో చెప్పాలనుకోవడం లేదు. ఉద్యోగుల కష్టాలను కూడా ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని కూడా సైమల్టేనియస్ గా చూపించాల్సిన సందర్భంలో.. ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కాలనుకుంటే మాత్రం అదురు దెబ్బ పడక మానదు.

ప్రస్తుతం అధికారికంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సాక్షి పేపర్ వెళ్తోంది, ప్రభుత్వం నుంచి వచ్చే స్టేషనరీ అలవెన్స్ లు ఉన్నా కూడా.. ఎక్కడికక్కడ ఉద్యోగులే తమ జేబులో నుంచి పేపర్ బిల్లులు చెల్లిస్తుంటారు. ఆ బిల్లులు ఎవరో ఒకరు ఏదో విధంగా నొక్కేస్తుంటారనుకోండి. అయితే ఇక్కడ సాక్షిలో తమకు వ్యతిరేకంగా కథనాలు వస్తుంటే, ఆ పేపర్ ని తీసుకెళ్లి ఆఫీస్ లో పెట్టి, పేపర్ యాజమాన్యాన్ని పరోక్షంగా పోషించాలంటే ఎవరికి మాత్రం మనసొప్పుతుంది. అందుకే ఉద్యోగులంతా ఈ దఫా గట్టిగా నిర్ణయం తీసుకున్నారట. 

తమ కష్టాల్ని చూపించడం మానేసి, తమపైనే సెటైర్లు వేస్తూ, కామెంట్లు చేసే సాక్షిని బ్యాన్ చేయాలనుకుంటున్నారట. చివరకు ఈ కథ ఏమలుపు తిరుగుతుందో చూడాలి.