కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ప్రచారం ఉదృతంగా సాగుతున్నప్పటికీ, ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్ఎస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందిస్తూ ‘అధికార టీఆర్ఎస్ ఒక్కో వార్డుకు రూ.కోటి చొప్పున ఖర్చు చేసింది. దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు’ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో 120 మున్సిపాలిటీల్లో 103 చోట్ల టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. అసలు టీఆర్ఎస్ సర్కార్ అంత గొప్పగా పరిపాలన చేస్తోందా? అంటే లేదనే చెబుతారు. మరెందుకు కేసీఆర్‌ను పదేపదే తెలంగాణ సమాజం ఆదరిస్తోంది అనే ప్రశ్నకు…ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ స్పందనలోనే సమాధానం దొరుకుతుంది.
దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ హవా సాగుతోంది. మోడీ – అమిత్‌షా అంటే సొంత పార్టీలోని వారికే కాదు, ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా గుండె దడ. వారిద్దరూ మునిపెన్నడూ లేని రీతిలో దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను వివిధ మార్గాల్లో భయపెడుతున్నారు. ఇది పచ్చి నిజం. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌తో కలిసి మోడీపై దండయాత్ర చేస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత మోడీ సర్కార్ తిరిగి అధికారంలోకి రావడం, చంద్రబాబు ఓడిపోవడం జరిగిపోయాయి.
ఎన్నికలకు ముందు మోడీపై అంతగా ఎగిరెగిరి పడిన చంద్రబాబు…ఇప్పుడు కేంద్రప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై నోరు తెరిచే సాహసం చేయడం లేదు. ఇక జగన్ మొదటి నుంచి తన కేసుల కారణంగా మోడీతో సన్నిహితంగానే మెలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మోడీపై మాట మాట్లాడేవారు లేరు.
కానీ తెలంగాణ సీఎం శనివారం సాయంత్రం మోడీపై , బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘బీజేపీ ఎంత.. దాని బతుకెంత?’ అనే ఒకేఒక్క ధిక్కార మాట చాలు కేసీఆర్‌ను తెలంగాణ సమాజం తమ గుండెల్లో పెట్టుకోడానికి. అలాగే దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సీఏఏపై కేసీఆర్ తనదైన శైలిలో చీల్చి చెండాడారు.
‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశానికి మంచిది కాదు. వందకు వందశాతం ఇది తప్పుడు నిర్ణయం. మేము ఎవరికి భయపడం. సీఏఏను పార్లమెంట్‌లోనే వ్యతిరేకించాం. దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సమానం అని రాజ్యాంగం ఉంది. అలాంటప్పుడు ముస్లింలను మాత్రం పక్కకు పెడితా అంటే ఎలా? ఇది నాకు బాధ కలిగిచింది. భారత్‌ను మోదీ హిందూ దేశంగా మార్చుతున్నారంటూ మేథావులు అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో కేంద్రం విద్వేషాలు రెచ్చగొడుతోంది. బీజేపీ తీరు ఇదేనా? సీఏఏను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టిపారేయాలి. సీఏఏను వ్యతిరేకిస్తూ అవసరమైతే 10 లక్షల మందితో సభ నిర్వహిస్తాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో మోడీని వ్యతిరేకిస్తున్న వారిలో కాంగ్రెస్ మినహాయిస్తే ప్రాంతీయ పార్టీల నేతల్లో మమతాబెనర్జీ, కేజ్రీవాల్, తెలంగాణకు వస్తే కేసీఆర్ మాత్రమే కనిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఊసే లేకుండా చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వెంటాడుతున్న మోడీ -అమిత్‌షాల ద్వయాన్ని ఎదిరించే, ధిక్కరించే, సవాల్ చేసే నేతను ఎవరు మాత్రం అక్కున చేర్చుకోరు?
కేసీఆర్‌ను కేవలం తెలంగాణ మాత్రమే కాదు…. మోడీపై యుద్ధం ప్రకటించిన తీరు, నువ్వెంత, నీ బతుకెంత అని బీజేపీని నిలదీసిన గుండె ధైర్యాన్నిచూసి తెలుగు వారిగా ప్రతి ఒక్కరూ గర్వించకుండా ఉండలేరు. అందుకే ఆయన సర్కార్ ఏం చేసినా, చేయకపోయినా… ఆత్మాభిమానం మెండుగా గల ఆ బక్క పల్చటి ప్రాణాన్ని తమ నాయకుడిగా పదేపదే కాపాడుకుంటూ వస్తోంది తెలంగాణ సమాజం. అదే ఆయన విజయ రహస్యం.