ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టులా బీజేపీ-జనసేన లాంగ్ మార్చ్ వ్యవహారం తయారైంది. బీజేపీ -జనసేన సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన లాంగ్‌మార్చ్ వాయిదా పడింది.
అమరావతి రాజధాని రైతుల కోసం ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన సంయుక్తంగా విజయవాడలో లాంగ్‌మార్చ్ చేస్తామని ఇటీవల ఢిల్లీ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రకటించారు. దీంతో ఆ రెండు పార్టీలు చేపట్టే లాంగ్‌మార్చ్‌పై ఏపీలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. సుమారు లక్ష మందితో లాంగ్‌మార్చ్ జరగవచ్చని, ఆ రోజు విజయవాడ నగరం అంతా ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారని అంచనా వేశారు.
ఇతరులను ఎగతాళి చేయడం సులభం. ఏదైనా చేసేవాళ్లకి తెలుస్తుంది, ఆ పనిలోని ఇబ్బందులు. విశాఖలో నిర్వహించాలనుకున్న రిపబ్లిక్ డేని తిరిగి విజయవాడకు మార్చిన నేపథ్యంలో పవన్ స్పందించారు. “చూశారా విశాఖలో రిపబ్లిక్ డే కూడా జరపలేకపోయారు. ఇక రాజధాని మార్చడం అంత సులభమా” అని ప్రశ్నించారు.
మరి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న జాతీయ పార్టీ బీజేపీతో కలసి చేయాలనుకున్న లాంగ్‌మార్చ్‌ను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో జనసేనాని చెప్పలేదేం? కేవలం ఫిబ్రవరి 2న బీజేపీ -జనసేన సంయుక్తంగా నిర్వహించాలనుకున్న లాంగ్‌మార్చ్‌ని వాయిదా వేసుకున్నట్టు బీజేపీ నేత నాగభూషణం ప్రకటించారు.
ఈ మాత్రం సంబడానికి ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ నేతలను కలవడం, అక్కడి నుంచి ఏదో పే…ద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు ఫోజులు పెట్టడం దేనికి పవన్? కనీసం మొట్టమొదటి సారి నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్‌పై కూడా కనీస ప్రణాళిక లేకపోతే…మున్ముందు మీ ఉద్యమాలు ఎలా ఉంటాయో అర్థమవుతోంది.