మళ్లీ ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా కేసీఆర్‌ ఆలోచనలు…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనతో తెర మీదికి వచ్చారు. తెర మీదికి వచ్చారంటే ఈయన ప్రత్యేకంగా పనిగట్టుకొని ఫెడరల్‌ ఫ్రంట్‌ పెడుతున్నానని గతంలో మాదిరిగా గర్జించలేదు. మాటల సందర్భంలో చెప్పారు.…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనతో తెర మీదికి వచ్చారు. తెర మీదికి వచ్చారంటే ఈయన ప్రత్యేకంగా పనిగట్టుకొని ఫెడరల్‌ ఫ్రంట్‌ పెడుతున్నానని గతంలో మాదిరిగా గర్జించలేదు. మాటల సందర్భంలో చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అనుకున్న ప్రకారమే టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ తన తనయుడు కమ్‌ మంత్రి కేటీఆర్‌, ఇతర నాయకులతో కలిసి తెలంగాణ భవన్లో సుదీర్ఘంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. 

మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని, కేటీఆర్‌ ఘనతను, తన పాలన తీరును, తీసుకురాబోయే చట్టాలను, ఉద్యోగులకు పీఆర్‌సీని…ఇలాంటివన్నీ ప్రస్తావించిన కేసీఆర్‌ పౌరసత్వ సవరణ చట్టాన్ని గురించి, దాన్ని తమ ప్రభుత్వం, పార్టీ వ్యతిరేకించిన తీరును వివరించారు. దీన్ని గురించి కేంద్రంపై విమర్శలు చేస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు. సీఏఏను టీఆర్‌ఎస్‌ పార్లమెంటులోనే వ్యతిరేకించిందన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. ఈ చట్టం దుర్మార్గమైందన్నారు. 

ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇక జాతీయ రాజకీయాల్లోకి దూకుడుగా వెళ్లాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు ఆయన మాటల వల్ల తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాదులో సీఏఏను వ్యతిరేకించే ముఖ్యమంత్రులను, రాష్ట్రాల్లో అధికారంలో లేని ప్రతిపక్షాల నేతలను కూడా రప్పించి భారీఎత్తున సమావేశాన్ని తానే నిర్వహిస్తానని, లీడ్‌ తీసుకుంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ సర్కారు ఏర్పడటం ఖాయమన్నారు. 

ఈ దేశానికి ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తప్ప గత్యంతరం లేదన్నారు. అవసరమైతే తాను మళ్లీ దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరతానన్నారు. దీన్నిబట్టి గతంలో మాదిరిగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని  చేసే విషయం కూడా విలేకరులు ప్రస్తావించగా కేసీఆర్‌ గట్టిగా కొట్టిపారేయలేదు. ఎప్పుడోఒకప్పుడు కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతాడన్నట్లుగానే మాట్లాడారు. అందులోనూ ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది కాబట్టి సీఎం కావడానికి కేటీఆర్‌కు అడ్డంకి ఉండకపోవచ్చు. సహజంగానే మున్సిపల్‌ ఎన్నికల విజయం కూడా కేసీఆర్‌ ఖాతాలోనే పడుతుంది కదా. 

సీఏఏను గురించి కేసీఆర్‌ చాలాసేపు మాట్లాడటం, బీజేపీపై విమర్శలు చేయడం, బీజేపీ క్రమంగా రాష్ట్రాలను కోల్పోతోందని చెప్పడం…ఇదంతా  జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ ప్రవేశాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి గట్టిగా చెప్పారు.  గతంలో ఫ్రంట్‌ పెడతానంటూ సింహగర్జన చేయగానే దేశమంతా కేసీఆర్‌ వైపు చూసింది. వెంటనే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. జాతీయ మీడియాలో చర్చలు జరిగాయి. తెలుగు మీడియా అప్పుడే ఐటీ మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేసింది. 

మంత్రి హరీష్‌రావు భవిష్యత్తు మీద రకరకాల కథనాలు వచ్చేశాయి. కేసీఆర్‌ ప్రధాని అయిపోతారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఓ పక్క ఏపీలో టీడీపీ-బీజేపీ తెగదెంపులు చేసుకుంటున్న సమయంలోనే కేసీఆర్‌ ఫ్రంట్‌ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు.  జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో మూడో కూటమి ఏర్పాటు చేసి, దేశం దశను దిశను మారుస్తానని గర్జించారు. బీజేపీని, కాంగ్రెసును వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలు, కీలక నాయకులు కేసీఆర్‌కు ఫోన్‌ల మీద ఫోన్‌లు చేసి అభినందించారు. స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎగిరి గంతులేశారు. కొందరు మంత్రులు కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నంత పని చేసి ప్రశంసించారు. 

కాని సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సూపర్‌ డూపర్‌ మెజారిటీతో గెలిచి మోదీ ప్రధాని కాగానే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంటును కట్టిపెట్టేసి తెరవెనక్కి వెళ్లిపోయారు.  రానురాను చప్పబడిపోయారు.  కేసీఆర్‌ లేవనెత్తిన కొన్ని ప్రశ్నలతో దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఏకీభవించినా  ఆయన ప్రతిపాదించిన కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. బీజేపీకి  వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలంటే కాంగ్రెసుతో కలవకుండా సాధ్యం కాదన్నారు కొందరు. బీజేపీతోపాటు కాంగ్రెసునూ వ్యతిరేకించి ప్రయోజనం లేదు. ఈ సత్యాన్ని  ఉద్దేశపూర్వకంగానే విస్మరించిన కేసీఆర్‌ దూకుడుగా వ్యవహరించారు. కాని ఆ తరువాత జరిగిన పరిణామాలు ఆయన ఆశలకు అడ్డు తగిలాయి. మొత్తం మీద తెరమరుగైన ఫెడరల్‌ ఫ్రంటును మళ్లీ తెర మీదికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని కేసీఆర్‌ చేస్తారని చెప్పుకోవచ్చు.