ఆ ఎమ్మెల్యేనే వైసీపీ అభ్య‌ర్థి అయితే…ఓడిస్తాం!

తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య‌పై సొంత పార్టీ నేత‌ల్లోనే తీవ్ర వ్య‌తిరేక‌త వుంది. రెండో ద‌ఫా సంజీవ‌య్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండోసారి రాష్ట్రంలోనే మూడో అత్య‌ధిక మెజార్టీ 61,292 ఓట్లు రావ‌డ‌మే…

తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య‌పై సొంత పార్టీ నేత‌ల్లోనే తీవ్ర వ్య‌తిరేక‌త వుంది. రెండో ద‌ఫా సంజీవ‌య్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండోసారి రాష్ట్రంలోనే మూడో అత్య‌ధిక మెజార్టీ 61,292 ఓట్లు రావ‌డ‌మే త‌ప్పైంది. భారీ మెజార్టీ ద‌క్కించుకోవ‌డంతో ఇక త‌న‌కు ఎదురే లేద‌నే లెక్క‌లేనిత‌నం సంజీవ‌య్య‌లో క‌నిపిస్తోంద‌ని వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా సూళ్లూరుపేట‌లో వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ బాబురెడ్డిని పోలీసుల‌తో సంజీవ‌య్య చిత‌క్కొట్టించారు. ఇది కాస్త నియోజ‌క‌వ‌ర్గంలోని రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో కోపాగ్నిని ర‌గిల్చింది. ఇప్పుడు బాబురెడ్డి, రేపు మ‌న‌కు ఇదే గ‌తే అనే అంత‌ర్మ‌థ‌నం వారిలో మొద‌లైంది. మ‌రోసారి సంజీవ‌య్య‌ను గెలిపించుకుంటే, అంద‌రికీ స‌మాధి క‌డ‌తార‌నే భ‌యం నెల‌కుంది.

సూళ్లూరుపేట‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా వుంది. మొద‌టి నుంచి రాజ‌కీయాల్లో వారి నిర్ణ‌య‌మే గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేస్తోంది. గ‌త రెండు ఎన్నిక‌ల్లో త‌న గెలుపున‌కు ఆర్థికంగా, హార్థికంగా ఆ సామాజిక వ‌ర్గం అండ‌గా నిలిచింద‌నే వాస్త‌వాన్ని సంజీవ‌య్య మ‌రిచిపోయార‌నే ఆవేద‌న వారిలో క‌నిపిస్తోంది. వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంక్‌గా ఉన్న వారిపైనే సంజీవ‌య్య క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌నేది వారి ఆరోప‌ణ‌.

గ‌త కొంత కాలంగా సూళ్లూరుపేట వైసీపీలో అసమ్మ‌తి నివురుగ‌ప్పిన నిప్పులా ఉండింది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో అది బ‌హిర్గ‌త‌మ‌వుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని సంజీవ‌య్య వ్య‌తిరేకులంతా ఏక‌మ‌వుతున్నారు. సంజీవ‌య్య వైఖ‌రిపై ఇప్ప‌టికే వైసీపీ పెద్ద‌ల‌కు భారీగా ఫిర్యాదుల చేశారు. ఒక‌వేళ త‌మ అభిప్రాయాల్ని కాదని సంజీవ‌య్య‌కు మ‌రోసారి టికెట్ ఇస్తే మాత్రం ఓడించ‌డానికి వెనుకాడేది లేద‌ని అస‌మ్మ‌తి నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం సూళ్లూరుపేట‌లో సంజీవ‌య్య‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి టీడీపీ కాద‌ని, సొంత పార్టీలోని అసంతృప్త నేత‌లే అనే చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకున్నా, విభేదాలు చేయిదాటాయ‌ని స‌మాచారం. ఒక‌వేళ అధిష్టానం స‌ర్ది చెబితే.. పైకి సంజీవ‌య్య‌తో స‌యోధ్య కుదుర్చుకున్నా, ఆయ‌న‌కు మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓట్లు వేయ‌రు, వేయించ‌ర‌ని ఖ‌రాఖండిగా చెబుతున్నారు.