మరో సినిమా మొదలుపెట్టిన పవన్ కల్యాణ్

ఓవైపు రాజకీయాలు చేస్తూనే, మరోవైపు తన సినిమాల షూటింగ్స్ కొనసాగిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఈ నటుడు కమ్ పొలిటీషియన్, ఢిల్లీ నుంచి ఇలా దిగడం, అలా కొత్త సినిమా షూటింగ్…

ఓవైపు రాజకీయాలు చేస్తూనే, మరోవైపు తన సినిమాల షూటింగ్స్ కొనసాగిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఈ నటుడు కమ్ పొలిటీషియన్, ఢిల్లీ నుంచి ఇలా దిగడం, అలా కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో కొత్త సినిమా ఈరోజు సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈరోజు ఉదయం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లాంఛనంగా మొదలైంది.

పవన్-హరీష్ ది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలిశారు. ఇవాళ్టి నుంచి షూట్ స్టార్ట్ అవ్వడంతో పవన్ అభిమానులు ఆనందంగా ఉన్నారు.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుకావాల్సింది. మధ్యలో భీమ్లానాయక్, వినోదాయ శితం రీమేక్ వచ్చి చేరడంతో ఎప్పటికప్పుడు ఆలస్యమౌతూ వచ్చింది. ఈ గ్యాప్ లో సినిమా టైటిల్ కూడా మార్చారు. భవదీయుడు భగత్ సింగ్ పేరు మార్చేసి, ఉస్తాద్ భగత్ సింగ్ గా నామకరణం చేశారు.

ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. పూజా హెగ్డే కోసం హరీశ్ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. మరో హీరోయిన్ గా శ్రీలీలను ఆల్రెడీ తీసుకున్నారు. గబ్బర్ సింగ్ కు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్, ఉస్తాద్ కు కూడా సంగీతం అందిస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తోంది ఉస్తాబ్ భగత్ సింగ్ సినిమా. ఇవాళ్టి షూటింగ్ తో ఎట్టకేలకు హరీశ్ శంకర్ సెట్స్ పైకి వచ్చినట్టయింది. కెరీర్ లో అతడికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది. అన్నట్టు ఇది కూడా రీమేక్ సినిమానే.