రామోజీ ఓట‌మి…ఎలాగంటే!

చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాదు, చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే అన్నారు కానీ, చ‌ట్టం ముందు కొంద‌రు ఎక్కువ స‌మాన‌మ‌ని ఎవ‌రూ అన‌లేదు. న్యాయ‌శాస్త్రాన్ని ఎందుకు రాసుకున్నామంటే, ఏది చ‌ట్ట స‌మ్మ‌తం, ఏది చ‌ట్ట‌విరుద్ధ‌మో…

చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాదు, చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే అన్నారు కానీ, చ‌ట్టం ముందు కొంద‌రు ఎక్కువ స‌మాన‌మ‌ని ఎవ‌రూ అన‌లేదు. న్యాయ‌శాస్త్రాన్ని ఎందుకు రాసుకున్నామంటే, ఏది చ‌ట్ట స‌మ్మ‌తం, ఏది చ‌ట్ట‌విరుద్ధ‌మో అంద‌రికీ తెలిసి అనుగుణంగా ప్ర‌జ‌లంతా జీవించ‌డానికి. స‌మాజంలో ఎంత పెద్ద వ్య‌క్తి అయినా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా న‌డిపితే సాధార‌ణ కానిస్టేబుల్ కూడా ఆపి కేసు పెట్టొచ్చు. అదీ చ‌ట్ట‌మంటే.

నాగ‌బాబులాంటి కొంద‌రు ఏమంటున్నారంటే రామోజీరావు కొన్ని వేల మందికి ఉపాధి క‌ల్పించిన ఆద‌ర్శ‌ప్రాయుల‌ని. నిజ‌మే దీంట్లో సందేహం లేదు. ఉపాధి క‌ల్పిస్తే చ‌ట్ట విరుద్ధ ప‌నులు చేయ‌డానికి లైసెన్స్ వున్న‌ట్టా?  పాయింట్ ఏమంటే ఆయ‌న చ‌ట్టాన్ని ఉల్లంఘించాడా? లేదా? ఉల్లంఘిస్తే శిక్ష‌కు అర్హులు. ఆయ‌న కోసం ఇప్ప‌టిక‌ప్పుడు కొత్త చ‌ట్టాలు చేయ‌లేరు క‌దా!

ఉపాధి, ఉద్యోగాలు అనేవి సిల్లీ పాయింట్స్‌. సొసైటీలో ఒక స్థాయికి ఎదిగిన వాళ్లంతా సింగిల్ ప‌ర్స‌న్స్ కాదు. వాళ్ల చుట్టూ అనేక వ్యాపారాలు, వ్య‌వ‌స్థ‌లు వుంటాయి. కొన్ని వంద‌లు, లేదా వేల మంది ప‌ని చేస్తూ వుంటారు. 

బ్యాంకుల‌కి డ‌బ్బులు ఎగ్గొట్టి పారిపోయిన విజ‌య్‌మాల్యా కూడా కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అందుక‌ని ఆయ‌న్ని నేర‌స్తుడు కాద‌ని అన‌లేం. జ‌నాల్ని ముంచేసి వెళ్లిన అగ్రిగోల్డ్ మొద‌లు అనేక సంస్థ‌ల్లో కొన్ని వేల మంది ఉద్యోగులున్నారు. ఉద్యోగాలు ఇచ్చారు కాబ‌ట్టి చ‌ట్ట విరుద్ధ ప‌నులు చేయ‌డానికి వాళ్ల‌కి లైసెన్స్‌లు ఇచ్చిన‌ట్టా?

దావూద్ ఇబ్ర‌హీం కూడా ముంబ‌య్‌లో కొన్ని వేల మందికి ఏదో ర‌కంగా ఉపాధి క‌ల్పించాడు. అందుకని కేసులు ఎత్తివేయ‌రు క‌దా!చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రి గురించి ఈనాడులో ప్ర‌త్యేక క‌థ‌నాలు వేసిన‌ప్పుడు, రామోజీ గురించి సోష‌ల్ మీడియాలో రాయ‌డం ఏ ర‌కంగా త‌ప్పు? ఆయ‌న ఆర్థిక నేరం చేశాడ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అభియోగం. 

చ‌ట్ట ప్ర‌కారం ఆ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. చ‌ట్టం ద్వారానే తాను నేరం చేయ‌లేద‌ని రామోజీ నిరూపించుకోవాలి త‌ప్ప‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వ వేధింపులు అన‌డం అజ్ఞానం.

రామోజీ కొన్ని వేల మందికి ఉపాధి క‌ల్పించిన మాట వాస్త‌వ‌మే కానీ, ఆ సంస్థ‌ల్లో ఉద్యోగుల్ని ఎంత దారుణంగా వేధిస్తారో జ‌ర్న‌లిస్టుల‌తో స‌హా అంద‌రికీ తెలుసు. అస‌లు కార్మిక చ‌ట్టాలు కొంచెం కూడా అక్క‌డ వ‌ర్తించ‌వు. జ‌ర్న‌లిస్టుల‌తో కూడా రోజుకి 10 నుంచి 12 గంట‌లు చేయిస్తే, మిగ‌తా వాళ్ల ప‌రిస్థితి ఊహించుకోవాల్సిందే. 

ఎవ‌రైనా క‌డుపు మండి హ‌క్కులు అడిగితే ఎన్ని ర‌కాలుగా వేధించాలో అన్ని ర‌కాలుగా వేధిస్తారు. విచార‌ణ రోజు అనారోగ్యాన్ని ఆశ్ర‌యించ‌డ‌మే రామోజీ ఓట‌మి. టైమ్ మ‌న వైపే వుండ‌దు. అదిప్పుడు జ‌గ‌న్ వైపు వ‌చ్చింది.