ఈ మధ్య కొంతకాలంగా చార్ట్ బస్టర్స్ ఇవ్వడం లేదు అని కంప్లయింట్ వుంది సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మీద. అయినా రంగస్థలం అతని ఖాతలోనిదే. సరిలేరు నీకెవ్వరు కూడా అతనిదే.
ఉప్పెన సంగతి సరే సరి. ఇప్పటికి విడుదలయిన మూడు పాటలు కూడా మంచి అప్లాజ్ తెచ్చుకున్నాయి. సరే, ఆ కంప్లయింట్, ఆ హిట్ సాంగ్స్ సంగతి అలా వుంచితే నితిన్ -కీర్తి సురేష్ లతో వెంకీ అట్లూరి చేస్తున్న రంగ్ దే కూడా దేవీ శ్రీ దే.
ఈ సినిమాకోసం చేసిన తొలిసాంగ్ ను విడుదల చేసారు. ఏమిటో ఇది, వివరించలేనిది అంటూ సాగే అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ సాంగ్ ఇది. ప్రేమికుల గుసగుసల ఘోషను రచయిత శ్రీమణి ఒడిసి పడితే, దేవీశ్రీ ప్రసాద్ తన దైన మాస్ బీట్ ను పక్కన పెట్టి, ఓ క్లాస్ ట్యూన్ ను అందించారు.
మన్మధుడు సినిమాల కాలంలో దేవీశ్రీ ప్రసాద్ రొమాంటిక్ డ్యూయట్లు అంటే ఇలాగే వుండేవి. మళ్లీ ఆ సిగ్నేచర్ స్టయిల్ ను వినిపించారు. ''..కోరుకోని కోరికేదో తీరుతున్నది…''లాంటి బిట్ ల దగ్గర ఎక్కడో విన్న ఫీలింగ్ కలగడానికి కారణం ఇదే కావచ్చు.
కపిల్ కపిలన్, హరిప్రియ ఈ పాటను ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి అయితే థియేటర్ లో లేదా ఓటిటిలో విడుదలవుతుంది.