దీపావళిని పురస్కరించుకుని బాణాసంచా పేల్చడం సహజమే. అయితే కరోనా వ్యాపిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో క్రాకర్స్ పేల్చడంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాణాసంచాను నిషేధించాలని తెలంగాణ సర్కార్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
దీపావళికి క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది ఇంద్రప్రకాశ్ హైకోర్టులో పిల్ వేశారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో బాణాసంచా వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయమై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇంత వరకూ తెరిచిన బాణాసంచా దుకాణాలను మూసివేయాలని తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
రాజస్థాన్ హైకోర్టు బ్యాన్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఎవరూ బాణాసంచా అమ్మడం, కొనడం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. నిషేధ ఆజ్ఞలు ధిక్కరించి ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని పేర్కొంది. అలాగే చర్యలపై ఈ నెల 19న తమకు తెలిపాలని హైకోర్టు ఆదేశించింది.