తెలంగాణ రాష్ట్ర సమితి హైదరబాద్ మున్సిపల్ ఎన్నికల విషయంలో తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయించుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. దుబ్బాక ఎన్నికల ఫలితం నేపథ్యంలో భాజపాకు మరింత సమయం ఇచ్చి, ఎన్నికలకు సమాయత్తం అయ్యే అవకాశం ఇవ్వకుండా వీలయినంత త్వరగా సిటీ ఎన్నికల నిర్వహించేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 4 నే అంటే దాదాపు ఇరవై రోజుల్లోనే జిహెచ్ ఎంసి ఎన్నికలు నిర్వహించేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు ఒక్కసారిగా గుప్పు మన్నాయి. నిజానికి దుబ్బాక ఎన్నిక తరువాత రెండు మూడు నెలల వరకు సిటీ ఎన్నికలు జరపరేమో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా సమయం కూడా వుంది కాబట్టి అందులో అభ్యంతరకరం అనేది ఏమీ వుండదు.
కానీ తెరాస అలా ఆలోచించడం లేదు. అంత సమయం ఇచ్చి, సిటీలో భాజపా తగిన వ్యూహరచన, అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా పద్దతిగా వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఇప్పుడే చేసేస్తే భాజపా అన్నీ సర్దుకునే అవకాశం వుండదని భావిస్తున్నట్లుంది.
నిజానికి ఇది ఓ విధంగా సూసైడెల్ అటెంప్ట్ కూడా. అసలే వరదల విషయంలో ప్రభుత్వ నిర్వహణ మీద కాస్త అసంతృప్తిగా వున్నారు సిటీ జనాలు. అలాగే కరోనా నిర్వహణ విషయంలో కూడా. ఇలాంటి నేపథ్యంలో దుబ్బాక ఫలితం వచ్చింది. దానిపై ఇప్పుడే జనాలు కాస్త ఆలోచిస్తున్నారు. అలాంటి సమయంలో ఎన్నికలు వస్తే ఎలా రియాక్ట్ అవుతారో క్లారిటీ లేదు. అటయినా కావచ్చు. ఇటయినా కావచ్చు.
కానీ తెరాస మాత్రం జనాల ఆలోచన సంగతి పక్కన పెట్టి, భాజపాను సన్నద్దం కాకుండా ఉక్కిరి బిక్కిరి చేయడం మీదే దృష్టి పెట్టి, త్వరగా ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.